వెంటనే PRC ప్రకటించాలి: ఉద్యోగ సంఘాలు

వేతనాల సవరణ కోసం రెండేండ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రభుత్వం  వేతన సవరణ కమిషన్ -పీఆర్సీ  గడువును వరుసగా మూడోసారి పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కమిషన్ గడువు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు, టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం మధ్యంతర భృతి-ఐఆర్ అయినా ఇవ్వాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల వేతన సవరణ కోసం 2018 మేలో తెలంగాణ తొలి పీఆర్సీని సర్కారు ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ చైర్మన్ గా మరో ఇద్దరు సభ్యులను నియమించింది. ఆ కమిషన్ ఆరు నెలల్లోనే నివేదికను ఇవ్వాలి. కానీ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. చివరిసారిగా పెంచిన గడువు ఈ నెల 24తో ముగియాల్సి ఉంది. కానీ సర్కారు ఏకంగా ఈ ఏడాది చివరి వరకు పొడిగించింది. ప్రభుత్వం పీఆర్సీ కమిటీకి వేతన సవరణతోపాటు అన్ని శాఖల్లో ఉద్యోగుల వివరాలు, సర్వీ స్ రూల్స్, ఉద్యోగుల ఖాళీలు సహా 11 అంశాల బాధ్యతలను కూడా అప్పగించింది. దీని వల్లే పీఆర్సీ పని ఆలస్యమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రం లో వేసిన పీఆర్సీని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015 ఫిబ్రవరి 5న సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఏకంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై 1 నుంచి కొత్త పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. గడువులోగానే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసినా.. సర్కారు నివేదిక తీసుకోలేదు. దీంతో ఉద్యోగులు, టీచర్లు సుమారు రెండేండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నా రు. పీఆర్సీ విషయంగా పలుమార్లు సీఎం కేసీఆర్ను కలిసేందుకు వారు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇటీవలి ఆర్టీసీ సమ్మె సమయంలో మాత్రం సీఎం కేసీఆర్ టీఎన్జీవో, టీజీవో నేతలను ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారు. వారితో కలిసి లంచ్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముగియగానే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పది పన్నెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ నవంబర్ 9న సర్కారు నుంచి కమిషన్ కు ఆదేశాలు వెళ్లడంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ అదేమీ అమల్లోకి రాలేదు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడువులోగా పీఆర్సీ ఇస్తామన్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి అన్నారు. కమిషన్ ఏర్పాటు చేశారు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ త్వరలోనే ఉద్యోగ సంఘాలను పిలిచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నామన్నారు.

పీఆర్సీ కమిషన్ గడువు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ ఆందోళన చేపట్టాలని టీచర్ సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీచర్ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) యూఎస్ పీసీ డిమాండ్ చేసింది. దీనిపై అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీచర్లకు పిలుపునిచ్చింది. రెండు మూడు రోజుల్లో టీచర్లు, పెన్షనర్ల సంఘం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది.

Latest Updates