కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో బాలింతల గోస

కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో బాలింతల గోస


హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు పడరాని పాట్లు పడుతున్నారు. వార్డుల్లో కనీసం సెలైన్ బాటిళ్లు పెట్టేందుకు స్టాండ్లు కూడా లేకపోవడంతో పేషెంట్లో వారి బంధువులో చేతితో పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని వార్డుల్లోని టాయిలెట్లలో కనీసం నీరు కూడా రావట్లేదు. ఇక ఇక్కడ చికిత్స పొందుతున్న ఒక్కో పేషెంట్​ కనీసం డైలీ రూ.200 చెల్లించాల్సి వస్తుంది. వార్డుల్లో డైలీ బెడ్స్​మార్చేందుకు రూ.50, క్లీన్​ చేస్తే రూ.50, బయటకు వెళ్లి రావాలంటే రూ.50.. ఇలా ఎక్కడ చూసినా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై పేషెంట్ల బంధువులు వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తే వారిపై ఫైర్​అవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి అంటే ఇలాగే ఉంటుందని బదులిస్తున్నారు. గ్లూకోజ్ స్టాండ్​ల విషయమై వైద్యులను ప్రశ్నించగా ఒక వార్డును కొత్తగా ఏర్పాటు చేశామని దాంట్లో గ్లూకోజ్ స్టాండ్లు లేవని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

డెలివరీ అయి వెళ్లాలంటే రూ.5 వేలు

డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన ఒక్కో గర్భిణి తిరిగి ఇంటికెళ్లే లోపు రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. మెయిన్​ గేటులోంచి ఎంట్రీ అయినప్పటి నుంచి వార్డులోకి చేరుకునే వరకు అంతటా డబ్బులివ్వకపోతే పని కావట్లేదు. ఆడపిల్ల పుడితే వేయి, మగ పిల్లాడైతే రూ.1500 ఇవ్వాల్సిందేనని సిబ్బంది డిమాండ్​ చేస్తున్నారు. ఉన్నతాధికారులంతా ప్రస్తుతం కరోనా డ్యూటీల్లో ఉన్నారు. ఈ ఆస్పత్రులను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఇక్కడ ఫెసిలిటీస్ దయనీయంగా మారుతున్నాయి. డాక్టర్లు కూడా సరైన సమయానికి రావడం లేదు. దీంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. మరోవైపు కరోనా రూల్స్ కూడా ఎవరూ పాటించట్లేదు. వార్డుల్లో గర్భిణులు, బాలింతల దగ్గరకు ముగ్గురు వెళ్లిన పట్టించుకునేవాళ్లే లేరు.