కన్నీ’టి’ తోటలు

  • అస్సాం టీ తోటల్లో గర్భిణుల కష్టాలు
  • 9 గంటల పాటు నిలువుకాళ్ల పని
  • పనికెళ్లకుంటే పూట గడవని పేదరికం
  • లక్షకు 237 ప్రసవ మరణాలు

రమకి భయమేస్తోంది. ఆమె ఆరు నెలల గర్భవతి. రోజులు గడుస్తున్న కొద్దీ పుట్టబోయే బిడ్డకు ఏమవుతుందోనని కంగారుపడుతోంది. ప్రతి రోజూ టీ తోటలకు వెళ్లి, ఆకుల్ని తుంచితే వచ్చే ఆదాయంతో ఆమె జీవనం సాగిస్తోంది. కడుపులో నొప్పి గా ఉన్నా అలాగే పనిచేస్తుంటుంది. వారానికి ఆరు రోజులు, ప్రతి రోజూ తొమ్మిది గంటల పాటు విరామం లేకుండా పని చేయాల్సిందే. టీ తోటల్లో పని రమకు కొత్త. ఇటీవలే ఈ పనిలో చేరింది. అస్సాంలోని సొనీట్ పూర్ జిల్లాలోని తేజ్ పూర్ అనే మారుమూల గ్రామంలో ఆమె ఉంటోంది. ఇక్కడి టీ తోటల్లో పని చేసే వాళ్లందరూ, దాదాపుగా తేజ్ పూర్ లోనే ఉంటారు. రోజూ ఇన్ని గంటల పాటు నిలబడి పని చేస్తుంటే, తన బిడ్డకు ఏమవుతుందోననే భయం రమను వెంటాడుతోంది. ఆమె రక్తంలో హిమోగ్లోబిన్ శాతం బాగా తగ్గినట్లు టెస్టుల్లో తేలింది. ఇది టీ తోటల్లో పని చేసే మహిళలకు మామూలే. కానీ గర్భవతిగా ఉన్న రమకు, కాన్పు జరిగే సమయంలో ఇది ప్రమాదకరం.

2014–16 మధ్య అస్సాంలో సగటున ప్రతి లక్ష కాన్పుల్లో 237 మంది మహిళలు చనిపోయారు. దేశంలో మరెక్కడా గర్భిణులు ఇంతటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న దాఖలాలు లేవు. 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) లెక్కల ప్రకారం ఇండియాలో ప్రతి లక్ష జననాలకు, 138 మంది మహిళలు చనిపోతున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 14గా ఉంది. అస్సాంలో 2006లో నమోదైన మరణాలతో పోలిస్తే 2016లో పరిస్థితి మెరుగైందనే చెప్పుకోవాలి. సర్కారు లెక్కల ప్రకారం అస్సాంలో 2006లో సగటున లక్ష కాన్పులకు 480 మంది మహిళలు చనిపోయారు.

సదుపాయాలు కల్పిస్తున్నాం

రమ పని చేస్తున్న తోట యజమానిని, గర్భిణీ కూలీలు పడుతున్న యాతనపై ప్రశ్నిస్తే కామెంట్ చేయడానికి నిరాకరించారు. మహిళలకు అవసరమైనప్పుడు అంబులెన్స్ లు, మెడికల్ వ్యాన్లను రప్పిస్తున్నట్లు చెప్పారు. చాలా మంది మహిళలకు ఎక్కువగా రక్తం పోతోందన్నారు. ఇది తమ చేతుల్లో లేదని, మెడికల్ సర్వీసులను మాత్రం నిరంతరం అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. దీనిపై రమ మాట్లాడుతూ కేవలం ఒకే ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని చెప్పా రు. అది కూడా సమయానికి తోట వద్దకు రాదని తెలిపారు. ప్లాం టేషన్ యాక్ట్ ప్రకారం టీ తోటల్లో పని చేసే కూలీలకు ప్రాథమిక వైద్యం ఉచితంగా అందజేస్తామని ఇండియన్ టీ అసోసియేషన్ పేర్కొంది. మెటర్నిటీ, రక్త హీనత, వ్యాధి నిరోధక శక్తి పెంపు తదితరాలు ఇందులో కవర్ అవుతాయంది.

వారానికి రూ.1000

తోటల్లో పని చేసే మహిళలందరూ పెద్ద పెద్ద బుట్టల్ని తగిలించుకుని గుంపులుగా వెళ్తారు. రోజులో ఒకసారి మాత్రమే విరామం తీసుకుంటారు. ఒక్కొక్కరు రోజుకు 24 కేజీల చొప్పున టీ ఆకుల్ని కోయాల్సిందే. అలా వారం పాటు చెమటోడ్చి తేగానీ చేతికి వెయ్యి రూపాయలు అందవు. టార్గెట్ ను అందుకోని వారి వేతనాల్లో కోతలు ఉంటాయి. దేశంలో రోజువారీ కూలీల సగటు వేతనం 320 రూపాయలుగా ఉంది. కానీ అస్సాం టీ తోటల్లో పని చేసే వాళ్లకు 167 రూపాయలు మాత్రమే యజమానులు చెల్లిస్తున్నారు. మెటర్నటీ చట్టాల గురించి తోటల్లో పని చేసే మహిళల కు తెలీదు. కేవలం పర్మనెంట్ వర్కర్లకు మాత్రమే అది వర్తిస్తుందని చాలా మంది మహిళలు భావిస్తున్నారు. అందులో రమ కూడా ఉంది.

తోటలోనే ప్రసవాలు

నెలలు నిండిన మహిళలు అస్సాం టీ తోటల్లో పని చేయడం తాను చూశానని లాయర్ సత్ప్యూతే తెలిపారు. చాలా మంది మహిళలు అక్కడే ప్రసవించిన సందర్భాలూ ఉన్నా యన్నారు. తోటల్లో పని చేసే మహిళలందరూ దాదాపుగా రక్త హీనతతో బాధపడుతుంటారని చెప్పా రు. వీళ్లకు ఆరోగ్య సదుపాయాలు అరకొరగానే ఉంటాయని వివరించారు. రమ కూడా భయపడుతోంది దీని గురించే. తాను ప్రసవించే సమయంలో ట్రీట్ మెంట్ అందదేమోనని ఆందోళన చెందుతోంది. అస్సాం లోని టీ తోటల్లో పని చేసే వారిలో 70 శాతం మంది మహిళలేనని సత్ప్యూతే వెల్లడించారు. వీళ్లలో 15 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులు తెలిపారు.

Latest Updates