గర్భిణీలకు డెలివరీకి ముందు కరోనా టెస్టు తప్పనిసరి

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న కంటెయిన్​మెంట్‌‌ జోన్లు, వలస కూలీల క్యాంపులు, హాట్‌‌స్పాట్లు, క్లస్టర్లలో ఉంటున్న ప్రెగ్నెంట్లకు డెలివరీకి ముందు కరోనా టెస్ట్ తప్పకుండా చేయించాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏరియాల్లో వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉన్నందున, డెలివరీ డేట్‌‌కు ఐదు రోజుల ముందు టెస్ట్ చేయించాలని రాష్ర్టాలకు సూచించింది. కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా టెస్టులు చేయించాల్సిందేనని స్పష్టం చేసింది. టెస్టుల కోసం గర్భిణులను తరలించొద్దని, వాళ్ల వద్దకే వెళ్లి శాంపిల్స్‌‌ సేకరించాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లకు వైద్యారోగ్యశాఖ సైతం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రసవానికి సిద్ధంగా 50,978 మంది

కేసీఆర్ కిట్ డేటా పోర్టల్ ప్రకారం ఈ నెలలో 50,978 మంది మహిళలు ప్రసవించనున్నారు. ఇందులో రాష్ర్టంలోని ఆరు రెడ్ జోన్‌‌ జిల్లాల్లో 21,127 మంది ఉన్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న గద్వాలలో 1,034 మందికి ఈ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారు. ఈ 7 జిల్లాల్లో డయాబెటిస్, హైబీపీ, రక్తహీనత, ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్న హైరిస్క్ ప్రెగ్నెన్సీ మహిళలు 4,172  మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చాలా ప్రైవేటు హాస్పిటల్స్ బంద్ కావడంతో.. ప్రభుత్వ దవాఖాన్లలో ప్రసవాల సంఖ్య పది శాతం పెరిగింది. ఏప్రిల్‌‌లో 45, 489 జననాలు నమోదయ్యాయి.

Latest Updates