జెట్టీ కట్టి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ..

ఏజెన్సీలో పురిటి కష్టాలు

ప్రసవానికి కిలోమీటర్లు నడవాల్సిందే
వర్షా కాలంలో వాగులతో మరిన్ని ఇక్కట్లు

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎర్రంపాడు గ్రామం చత్తీస్‍గఢ్‍కు సరిహద్దులో ఉంది. ఆ గ్రామంలోని కొవ్వాసి ఐత అనే మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఊరి నుంచి బయటకు రావాలంటే రహదారి లేదు. దీంతో భర్త మూస స్థానిక ఆశా కార్యకర్త సోమమ్మ, ఆమె భర్త సోమయ్య సహకారంతో జెట్టీ కట్టి పక్కనే ఉన్న చెన్నాపురానికి మూడు కి.మీ. నడుచుకుంటూ బయలుదేరారు. దారిలోనే ఐత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఊరికి బత్తినపల్లి మీదుగా రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ఆగిపోయాయి. దీంతో ఏ కష్టం వచ్చినా గ్రామస్థులకు కాలినడక తప్పడం లేదు. గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన సంధ్య పరిస్థితి మరీ దారుణం. ఈమెకు పురిటినొప్పులు వచ్చిన సమయంలో వాగు పొంగడంతో 10 కి.మీ. నడిపించాల్సి వచ్చింది. వాగు అవతల నుంచి 108లో హాస్పిటల్కు తరలించారు. అక్కడ సంధ్యారాణి మగబిడ్డను ప్రసవించింది.

ఏడు దశాబ్దాలుగా..
ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటం లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలోని గర్భిణుల కష్టాలు వర్ణనాతీతం. ప్రస్తుత వర్షాకాలంలో జిల్లాలో డెలివరీ తేదీ ఉన్న గర్భిణులు సుమారు 1,521 మంది ఉన్నారు. ఇవి వైద్య, ఆరోగ్యశాఖ లెక్కలు. భద్రాచలం మన్యంలోనే సుమారు 75 మంది ఉన్నారు. ఇక ఇల్లెందు ఏజెన్సీలో మారుమూల రహదారి సౌకర్యం లేని గ్రామాల్లో మరో 50 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 9 నెలలు నిండిన వారిని, రహదారి, వంతెనలు లేని గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు క్షేత్రస్థాయిలోని సిబ్బంది చేత తరలించాలని జిల్లా కలెక్టర్లు ఎన్నిసార్లు సమావేశాల్లో సూచించినా వైద్యాధికారులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో మహిళలకు కష్టాలు తప్పడం లేదు.

హైరిస్క్ ఉంటేనే తరలిస్తున్నాం
సాధారణంగా హైరిస్కు ఉంటేనే గర్భిణులను ముందుగా ఆసుపత్రికి తరలిస్తాం. డెలివరీ డేట్ ప్రకారం రెండు రోజుల ముందే వారిని సమీప ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తున్నాం. కానీ ఇచ్చిన డేట్‍కంటే 10, 15 రోజుల ముందు పురిటినొప్పులు వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
‑ డా.భాస్కర్‍నాయక్‍, డీఎంఅండ్‍హెచ్‍

For More News..

మావోయిస్టులను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం

చనిపోయినప్పుడు నెగెటివ్‍.. తెల్లారే పాజిటివ్‍..

272 కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసిన మాజీ ఎమ్మెల్యే

Latest Updates