ఒలింపిక్స్ జరిగేనా?.వాయిదాకు పెరుగుతున్నడిమాండ్లు

ఓవైపు కరోనా విస్తరిస్తూనే ఉంది.. మరోవైపు ఒలింపిక్స్‌‌కు సంబంధించిన కార్యక్రమాలు జరిగిపోతూనే ఉన్నాయి..! గ్రీస్‌‌ నుంచి ఒలింపిక్‌‌ టార్చ్‌‌ జపాన్‌‌కు కూడా వచ్చేసింది..! ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇప్పుడు మొదలైంది..! మొన్నటి వరకు పెద్దగా నోరు మెదపని అసోసియేషన్లు.. ఇప్పుడు వాయిదాను కోరుకుంటున్నాయి..! బడా దేశాల సంఘాలన్నీ ఒకే తాటిపైకి వస్తుండటం.. అథ్లెట్లు కూడా గుర్రుగా ఉండటంతో… గేమ్స్‌‌ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక ఐఓసీ తలపట్టుకుంటోంది..! బయటకు మాత్రం షెడ్యూల్‌‌ ప్రకారమే జరుగుతాయని చెబుతున్నా.. లోలోపల చాలా మధనం జరుగుతోందని ఒలింపిక్స్‌‌కు సంబంధించిన పెద్ద తలకాయల మాటలను బట్టి తెలుస్తోంది..! ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌‌ జరుగుతాయా? లేదా? అన్న సందేహాలు రెట్టింపవుతుండగా  ఐఓసీ ఏం చేయబోతోంది..!!

టోక్యోఒలింపిక్స్‌‌కు సంబంధించి రోజుకో కీలక ఘట్టం జరుగుతున్నా… గేమ్స్‌‌ నిర్వహణపై సందేహాలు మాత్రం తగ్గడం లేదు. ఏదో ఓ దశలో గేమ్స్‌‌ ఆగిపోతాయని సంకేతాలు వెలువడుతున్నా… ప్రస్తుతం జపాన్‌‌లో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గురువారం నుంచి జరిగే టార్చ్‌‌ రిలేను జపాన్‌‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏథెన్స్‌‌ నుంచి శుక్రవారం ఇక్కడికి చేరుకున్న టార్చ్‌‌ను చూడటానికి జనాలు ఎగబడుతున్నారు. దీంతో కరోనా వైరస్‌‌ పెరుగుతుందేమోనన్న ఆందోళనలు కూడా మొదలయ్యాయి. జపాన్‌‌ ఉత్తర భూభాగంలోని ఫకుషిమాలో ప్రారంభమయ్యే ఈ రిలే కోసం అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 2011లో వచ్చిన సునామీ, భూకంపాలకు తోడుగా న్యూక్లియర్‌‌ రియాక్టర్ల పేలుడుతో ఫకుషిమా ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నది. చాలా కాలం కనీస వసతులు లేక జనసంచారం కూడా బాగా తగ్గింది. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకుని జీవనం మొదలుపెట్టారు. అలాంటి ప్రాంతంలో రిలేను నిర్వహించడం ద్వారా ఫకుషిమా కోలుకుందని ప్రపంచానికి చాటి చెప్పాలని జపాన్‌‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక్కడ జరిగే టార్చ్‌‌ రిలే ద్వారా స్పాన్సర్లకు కూడా భారీ ఆదాయం సమకూరనుండటంతో గేమ్స్‌‌కు ఢోకా లేదనే ప్రచారం కూడా మొదలైంది. మే 18, 19 తేదీల్లో హిరోషిమాలో రిలే జరుగుతుంది. ఇంత పకడ్బందీగా రిలే మొదలుపెడుతున్నా… ఓ సర్వేలో 69.9 శాతం మంది జపాన్‌‌ ప్రజలు మాత్రం షెడ్యూల్‌‌ ప్రకారం గేమ్స్‌‌ జరగవని చెబుతున్నారు.

వాయిదా వేయాల్సిందే..

జపాన్‌‌లో పరిస్థితి అలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా కూడా గేమ్స్‌‌పై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. క్వాలిఫికేషన్‌‌ ఈవెంట్స్‌‌ నిలిచిపోవడంతో చాలా మంది అథ్లెట్లు గేమ్స్‌‌ను పోస్ట్‌‌పోన్‌‌ చేయాలని కోరుకుంటున్నారు. చాలా ఇంటర్నేషనల్‌‌ అసోసియేషన్లు కూడా దీనికి మద్దతు పలుకుతున్నాయి. కొలంబియా, స్లోవేనియా, నార్వే, అమెరికా స్విమ్మింగ్‌‌, ఫ్రెంచ్‌‌ స్విమ్మింగ్‌‌ అసోసియేషన్లు.. గేమ్స్‌‌ను పోస్ట్‌‌పోన్‌‌ చేయాలని డిమాండ్‌‌ చేస్తున్నాయి. కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్​ కాకపోతే దాదాపు 11 వేల మంది అథ్లెట్లను గేమ్స్‌‌ విలేజ్‌‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దీనివల్ల వైరస్‌‌ పెరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గేమ్స్‌‌ను వాయిదా వేయడం మంచిదని నార్వే ఒలింపిక్‌‌ అసోసియేషన్‌‌ చేసిన విజ్ఞప్తిపై టోక్యో గేమ్స్‌‌ ఆర్గనైజింగ్‌‌ కమిటీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ తొషియాకి ఎండో స్పందించారు. కానీ వాయిదా గురించి మాట్లాడకుండా అనుకున్న షెడ్యూల్‌‌ ప్రకారమే గేమ్స్‌‌ జరుగుతాయని స్పష్టం చేశారు. దాదాపు ఏడాది పాటు వాయిదా వేయాలని యూఎస్‌‌ అసోసియేషన్‌‌ కోరుతోంది.

ఇలాగైతే ఎలా..!

ఒకవేళ గేమ్స్‌‌ను వాయిదా వేయాలంటే ఎవరు నిర్ణయం తీసుకోవాలి. ఇంకా నాలుగు నెలల సమయం ఉందని చెబుతున్న నిర్వాహకులు ఇప్పుడే వాయిదా నిర్ణయం ప్రకటించడం తొందరపాటే అవుతుందని చెబుతున్నారు. కనీసం గేమ్స్‌‌కు సంబంధించిన ఏదో విషయాన్ని ఫలానా రోజున ప్రకటిస్తామని డెడ్‌‌లైన్‌‌ కూడా పెట్టడం లేదంటే ఐఓసీ ఎంత పట్టుదలను ప్రదర్శిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 1.43 బిలియన్‌‌ డాలర్లతో నిర్వహించిన టోక్యో సెంటర్‌‌ స్టేడియంలో అట్టహాసంగా గేమ్స్‌‌ను మొదలుపెట్టాలని భావిస్తున్నా.. అది జరిగేలా కనబడటం లేదు. ఐఓసీ తీరుపై సంఘంలోని సభ్యులే విమర్శలు చేస్తున్నారు. మానవత్వం లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఐఓసీ సభ్యురాలు కెనడాకు చెందిన హాలే విక్‌‌నైసర్‌‌ విమర్శించింది. ఇక అథ్లెట్ల ప్రాణాలతో అంతర్జాతీయ బాడీ ఆటలాడుతోందని జపాన్ ఒలింపిక్‌‌ కమిటీ సభ్యుడు కొరీ యమగుచి మండిపడ్డారు.

నిర్ణయం ఎవరిది..?

గేమ్స్‌‌ వాయిదాపై ఒత్తిడి పెరుగుతున్నా.. ఐఓసీ ప్రెసిడెంట్‌‌ థామస్‌‌ బాచ్‌‌ మాత్రం పెడ చెవిన పెడుతున్నారు. గేమ్స్‌‌ను రద్దు చేసే ఆలోచన తమకు లేదని స్పష్టంగా చెబుతున్నాడు. అసలు గేమ్స్‌‌ను రద్దు చేస్తే అతనికి వచ్చే నష్టం ఏంటీ? ఈ విషయంలో నిర్ణయం తీసుకునేదెవరు? అనే దానిపై చర్చ నడుస్తోంది. గేమ్స్‌‌ను వాయిదా వేయాలన్నా లేదా రద్దు చేయాలన్నా.. ఐఓసీతో పాటు టోక్యో సిటీ, జపాన్‌‌ ఒలింపిక్‌‌ కమిటీ సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలి. గేమ్స్‌‌ నిర్వహణకు సంబంధించి ఈ ముగ్గురి మధ్య ‘త్రైపాక్షిక ఒప్పందం’ ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరూ ఈ కాంట్రాక్ట్‌‌ను ఉల్లంఘించడానికి వీల్లేదు. ఒకవేళ అథ్లెట్ల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిస్తే ఇందులో ఎవరైనా కాంట్రాక్ట్‌‌ను అతిక్రమించొచ్చు. కానీ ఇది చాలా రిస్క్‌‌తో కూడుకున్నది. ఎందుకంటే గేమ్స్‌‌ కోసం జపాన్‌‌ వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నిర్వహణ కోసం రూ. 1260 కోట్లు కేటాయించింది. కానీ ప్రాక్టికల్‌‌గా ఈ ఖర్చు మరింత పెరిగిపోతుంది. అదే గేమ్స్‌‌ వాయిదా వేసినా రద్దు చేసినా.. ఐఓసీకి మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే రూ. 200 కోట్ల రిజర్వ్‌‌ ఫండ్‌‌తో పాటు ఇన్సూరెన్స్‌‌ ద్వారా కొంత నష్టాన్ని భర్తీ చేసుకుంటుంది. కాబట్టి కఠిన నిర్ణయం ఏదైనా జపాన్‌‌ నుంచే రావాలి. ఆర్థికంగా చాలా నష్టపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జపాన్‌‌ ఆ సాహసం చేస్తుందా? ప్రజారోగ్యం దృష్ట్యా వాయిదాకు మొగ్గుతుందా .. చూడాలి.

Latest Updates