తగ్గిన వినాయక విగ్రహాల తయారీ

  • గణేశ్ ఉత్సవాలపై నో క్లారిటీ
  •  తయారు చేస్తే అమ్ముతయో, లేదోనని ఆందోళన
  •  ఇట్లైతే ఏడాదంతా పస్తులేనని ఆవేదన
  •  విగ్రహాల రేట్లు పెరిగే అవకాశం

గణపతి విగ్రహాల తయారీపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా భయంతో అమ్ముడు పోతాయో లేదో అని చాలా చోట్ల విగ్రహాల తయారీ నిలిచిపోయింది. గణేశ్ ఉత్సవాలకు పర్మిషన్‌ ఉంటుందా లేదా అని ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే 30 శాతం విగ్రహాలు తయారు కాగా,వీటి కి రంగులు వేసే పనిలో కళాకారులు ఉన్నారు. పరిస్థితి ఇట్లనే ఉంటే ఏడాదంతా తమకు పస్తులే అని కళాకారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈసారి విగ్రహాల రేట్లు పెరుగు తాయని తయారీదారులు పేర్కొంటున్నారు.

 ‘కరోనా’ భయంతో..

మరో రెండు నెలల్లో వినాయక చవితి. అయినా కరోనా భయంతో ఈసారి చాలా చోట్ల విగ్రహాల తయారీ నిలిపివేశారు. ఇప్పటి దాకా 30శాతం విగ్రహాలు చేశారు. కొన్ని చోట్ల కిందటేడాది మిగిలిపోయిన విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్నారు. ముందస్తుగా తయారు చేసి పెట్టుకుంటే, అమ్ముడుపోతాయో లేదోనని టెన్షన్‌ పడుతున్నారు. సేల్స్‌ లేకుంటే చేసిన పని, పెట్టుబడి రెండూ నష్టపోవాలంటున్నారు. కొన్ని చోట్లమాత్రం రెండు ఫీట్ల లోపు విగ్రహాలు తయారు చేస్తున్నారు.

పూటెట్ల గడవాలో..

లోకల్‌ వారితోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి మన రాష్ట్రంలో విగ్రహాలు తయారు చే స్తున్నారు. వీరు ఆరు నెలల ముందు నుంచి పనులు ప్రారంభిస్తారు. ఇన్ని రోజులు పనులు చేసుకుంటే వచ్చే ఆదాయంతో ఏడాది గడిపేస్తారు. ఇప్పటికే 40శాతం మంది కళాకారులు కరోనా భయంతో సొంత రాష్ట్రాలకు వెళ్లారు. ఇక్కడ ఉన్నోళ్లలో కూడా చాలా మందికి పని దొరకడంలేదు. దీంతో ఈ సారి కళాకారులకు తీవ్ర నష్టపోతున్నారు. పని, గిరాకీ లేకుంటే ఎట్లా బతికేదని మనాదిపడుతున్నారు.

 రేట్లు పెరుగుతయ్…

ఈసారి గణపతి విగ్రహాల రేట్లు పెరుగుతాయని తయారీదారులు పేర్కొంటున్నారు. ఈ సారి గణపతి మండపాల్లో పెద్దగా హడావుడి ఉండదని, ఉత్సవాలు సాదాసీదాగా జరగొచ్చని తయారీదారులు భావిస్తున్నారు. పెద్ద విగ్రహాలు కొనే పరిస్థితి ఉండదంటున్నారు. ఒక్కో బొమ్మపై గతంలో కంటే ఈ సారి 20నుంచి 40శాతం రేట్లు పెరగొచ్చని చెబుతున్నారు. ఇక మట్టి గణపతులకు మాత్రం కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేదని తయారీదారులు చెబుతున్నారు.

Latest Updates