మనొళ్లు ముగ్గురికి బాల్​శక్తి అవార్డులు

  • మేజిక్​తో దర్శ్.. షూటింగ్​తో ఇషా సింగ్..
  • మౌంటెనీరింగ్​తో సమన్యూ..
  • రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నరు

న్యూఢిల్లీ, వెలుగు: వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిన పిల్లలకిచ్చే బాల్ శక్తి అవార్డులను మనోళ్లు ముగ్గురు అందుకున్నారు. ఈ ఏడాది మొత్తం 49 మంది పిల్లలకు ఈ పురస్కారం అందజేయగా.. అందులో మన రాష్ట్రానికి చెందిన ముగ్గురితో పాటు ఏపీకి చెందిన రోలర్​ స్కేటర్​ సంహిత కూడా ఉన్నారు. తన మేజిక్​తో మాయచేసిన దర్శ్​మలానీ, షూటింగ్​లో ఎన్నో పతకాలను గెలుచుకున్న యువ షూటర్​ ఇషా సింగ్, ఏడేళ్ల వయసులోనే కిలిమంజారో అధిరోహించిన యంగ్​ మౌంటెనీర్​ సమన్యూ పోతురాజులను ఈ అవార్డు దక్కింది. బుధవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్​ రామ్​నాథ్​ కోవింద్​ చేతుల మీదుగా ఈ ముగ్గురూ బాల్​శక్తి పురస్కార్​ను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన రోలర్​ స్కేటర్​ ఆకుల సాయి సంహితను కూడా ఈ అవార్డు వరించింది. కార్యక్రమం ముగిసిన తర్వాత హైద్రాబాదీ దర్శ్​ మలానీ వెలుగుతో మాట్లాడాడు. బాల్​శక్తి అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని, ఈ అవార్డును తన తల్లికి అంకితమిస్తున్నానని చెప్పాడు.

హైద్రాబాదీ దర్శ్​మలానీ..

ఈస్ట్ మారెడుపల్లికి చెందిన దర్శ్ మలానీ వయసు పదకొండేళ్లు.. ఇప్పటి వరకు ఇండియాలో దర్శ్​చేసిన షోలు 70.. అమెరికా, దుబాయి, బ్రిటన్ వంటి దేశాల్లోనూ పలు షోలు చేశాడు. ఎనిమిదేళ్ల వయసులో ఇంటర్నెట్​లో చూసిన మేజిక్​ షో తనలో ఆసక్తిని పెంచిందని దర్శ్​ చెప్పాడు. తర్వాత పట్టుదలగా మేజిక్​ నేర్చుకుని ఏకంగా షో లు చేసే స్థాయికి ఎదిగాడు. ఆసియా బుక్ ఆఫ్  రికార్డులో గ్రాండ్ మాస్టర్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో ప్రవీణ మాంత్రికుడిగా దర్శ్ పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది జూలై లో వాషింగ్ టన్ లో జరిగే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పోటీల్లో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు. మ్యాజిక్ ను ఒక హ్యాబిగానే చేస్తున్నానని, ఐఐటీ లో మంచి ర్యాంక్ సాధించడమే తన లక్ష్యమని దర్శ్ చెబుతున్నాడు. 2018 లో చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్ లోని ఒక ఎన్జీఓ నిర్వహించిన కార్యక్రమంలో చేసిన మ్యాజిక్ షో తన జీవితాన్నే మార్చేసిందని తెలిపాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాల కోసం తాను మ్యాజిక్ షోలు నిర్వహిస్తున్నట్లు దర్శ్​ చెప్పాడు.

Latest Updates