3 వ్యవసాయ బిల్లులకి రాష్ట్రపతి ఆమోదముద్ర

వ్యవసాయ రంగానికి సంబంధించి పార్లమెంటులో ఇటీవల ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం సంతరించుకున్నాయి. ఒకవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపినప్పటికీ ఈ బిల్లుల ఆమోదానికే ఆయన మొగ్గు చూపారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభలు ఆమోదించిన రైతు ఉత్పత్తి వ్యాపారం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు 2020, రైతుల ధర భరోసా (సాధికారత మరియు రక్షణ), వ్యవసాయ సేవల ఒప్పందం బిల్లు 2020, ముఖ్యమైన వస్తువుల (సవరణ) బిల్లు 2020ను ఆమోదిస్తున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు.

ఈ బిల్లులపై హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు సహా పలు విపక్ష పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించాయి. విపక్షాల తరఫున కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బిల్లులను వెనక్కి పంపించాలని కోరారు. వీటిపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతుండగానే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం గమనార్హం.

Latest Updates