ఎంబీబీఎస్‌‌ సీట్లు బ్లాక్‌‌!

  • బీ కేటగిరీ సీట్లు వదిలేసిన 40 మంది విద్యార్థులు
  • సీటు బ్లాకింగ్‌‌ కోసమేనని అనుమానాలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్‌‌ ప్రవేశాల ప్రక్రియ శనివారం నాటికి ముగియనుంది. అయితే, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నార్త్‌‌ ఇండియన్ స్టూడెంట్లతో ప్రైవేటు కాలేజీలు బీ కేటగిరీ సీట్లను బ్లాక్‌‌ చేయించినట్టు సమాచారం. మొత్తం 40 సీట్లను బ్లాక్ చేసినట్టు తెలుస్తుండగా, 30 సీట్ల లోపే బ్లాక్ అయ్యే అవకాశముందని కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 28న కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత స్టూడెంట్లు చేరకుండా మిగిలిపోయిన సీట్లు, బీ కేటగిరీ సీట్లలో చేరి వదిలేసిన సీట్లను ఎటువంటి కౌన్సెలింగ్‌‌ నిర్వహించకుండా భర్తీ చేసుకునేందుకు కాలేజీలకు అనుమతి ఉంది. బీ కేటగిరీ సీటు ఫీజు రూ.11.5 లక్షలు ఉంటే, సీ కేటగిరీ సీటు ఫీజు రూ.23 లక్షలు ఉంది. ఈ నేపథ్యంలో బీ కేటగిరీ సీట్లను నీట్‌‌లో మెరిట్ సాధించిన నార్త్‌‌ ఇండియా విద్యార్థులతో బ్లాక్ చేయిస్తారు. వాళ్లు తమ సొంత రాష్ట్రంలో సీటు పొంది, మళ్లీ వచ్చి ఇక్కడ మేనేజ్‌‌మెంట్ కోటా కౌన్సెలింగ్‌‌లో పాల్గొంటారు. మెరిట్ ర్యాంక్ ఉండడంతో ఇక్కడ అనుకున్న కాలేజీలో సీటు పొందుతారు. కౌన్సెలింగ్ పూర్తవగానే సీటు వదిలేస్తున్నట్టు కాలేజీలకు లెటర్ ఇచ్చి వెళ్లిపోతారు. దీంతో బీ కేటగిరీ సీటు కాస్త, సీ కేటగిరీగా మారుతుంది. వీటిని అధిక ఫీజులకు కాలేజీలు అమ్ముకుంటాయి. ఇలా సీట్లు బ్లాక్ చేసినందుకుగానూ విద్యార్థులు, ఏజెంట్లకు కాలేజీలు రూ.లక్షల్లో డబ్బు చెల్లిస్తాయి. మాప్‌‌ అప్ రౌండ్ కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు కాలేజీల్లో కలిపి సుమారు 40 మంది సీట్లు వదిలేసినట్టు సమాచారం. ఈ ఏడాది అధిక సంఖ్యలో నార్త్‌‌ ఇండియా విద్యార్థులు కౌన్సెలింగ్‌‌లో పాల్గొనడంతో సీటు బ్లాకింగ్ జరిగి ఉండొచ్చని వర్సిటీ అధికారులు సైతం అనుమానించారు. తల్లిదండ్రులను తీసుకుని వస్తే తప్ప కౌన్సెలింగ్‌‌కు అనుమతించబోమన్న నిబంధన తీసుకొచ్చారు.

 

Latest Updates