ప్రైవేట్ డిగ్రీ కాలేజీల ఆగడాలు..అధిక ఫీజులు వసూలు

డిగ్రీ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‍ను ప్రైవేటు డిగ్రీ కాలేజీలు క్యాష్‍ చేసుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు డిగ్రీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఎంపికలో ప్రయారిటీ ఇవ్వడం ప్రైవేట్‍ కాలేజీలకు కలిసివస్తుంది. హైదరాబాద్‍లో పలు డిగ్రీ కాలేజీలు తమ ఇష్టానుసారంగా ఫీజులు నిర్ణయిస్తూ.. విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నాయి. కొన్ని డిగ్రీ కాలేజీల్లో గత అకడమిక్‍ ఇయర్‍ కంటే ఈ ఏడు 20 నుంచి 30 శాతం దాకా ఫీజులు పెంచినట్లు సమాచారం. ప్రైవేట్‍ కాలేజీల్లో బీకాం కోర్సులను చదివేందుకు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాలేజీలు కామర్స్, ఎకనామిక్స్ లాంటి సంప్రదాయ సబ్జెక్టులు కంప్యూటర్‍ మోడ్ కోర్సులకు భారీగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నాయి. బీఏ, బీకాం కోర్సులకు కంప్యూటర్స్ అని చివరన తగిలించి సాధారణం కంటే అదనంగా విద్యార్థుల నుంచి యాజమన్యాలు ఫీజులను వసూలు చేస్తున్నారు.

రూల్స్​పాటించరా!

డిగ్రీ కాలేజీలకు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తింపు ఇస్తుంది. డిగ్రీ కాలేజీల్లో నియమ, నిబంధనలు, విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలు, కోర్సుల గుర్తింపు, సిలబస్‍, ఎగ్జామ్స్ లాంటి పలు అంశాలను ఓయూ నిర్ణయిస్తుంది. కానీ వాటి అమలును మాత్రం గాలికొదిలేసినట్లు కన్పిస్తుంది. ఏటా అకడమిక్ ఇయర్‍ ప్రారంభానికి ముందు ఆయా కాలేజీలను తనిఖీ బృందం సందర్శించి నిబంధనల అమలుపై ఓయూకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ తనిఖీలన్నీ పేపర్లపైనే జరుగుతున్నట్లు కన్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో పలు ప్రైవేటు కాలేజీలు బాహాటంగానే ఓయూ రూల్స్ తుంగలో తొక్కుతున్నాయి. రూల్స్ ప్రకారం డిగ్రీ జనరల్‍ కోర్సులకు రూ.7వేలు, ఇతర కోర్సుల రూ.11వేలు ఫీజుగా నిర్ణయించారు. నగరంలోని పలు ప్రైవేట్‍ కాలేజీలు జనరల్‍ కోర్సులకు రూ.20వేల నుంచి 30వేలు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.  రెండో సంవత్సరం చదివే విద్యార్థులకు సెమిస్టర్ పరీక్ష ఫీజుని రూ.810 గా ఓయూ నిర్ణయించగా తమ కాలేజీలో మాత్రం రూ.1250 వసూలు చేసినట్లు ఓ డిగ్రీ కాలేజీలో చదివే విద్యార్థిని వాపోయారు.

ఆన్‍లైన్‍ ద్వారానే సీట్ల భర్తీ

2019–20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో సీట్లను ‘దోస్త్’ ద్వారా ఆన్‍లైన్‍లో భర్తీ చేసేందుకు తెలంగాణ హయ్యర్‍ ఎడ్యుకేషన్‍ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్‍, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో దీని ద్వారానే సీట్లు భర్తీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. మే 16 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్‍లైన్‍లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే డిగ్రీ కాలేజీల్లో సీట్లు కేటాయించనున్నారు. ప్రైవేటు కాలేజీలు మాత్రం తమకు ‘దోస్త్’ వర్తించదని ముందుగానే అడ్మిషన్లను ప్రారంభించడం గమనార్హం.

Latest Updates