విత్తనాల రేట్లు పెంపు..ఐదేళ్లుగా అందని రాయితీ విత్తనాలు

సిద్దిపేటగజ్వేల్, వెలుగు:  2015 నుంచి రాయితీ విత్తనాల సరఫరాను రాష్ట్ర సర్కారు నిలిపివేసింది. దీంతో ‌‌ కూరగాయలు సాగు చేస్తున్న రైతులు బహిరంగ మార్కెట్లో  విత్తనాలు కొనక తప్పడం లేదు.  ప్రస్తుతం మార్కెట్ లో సీజెంటా, బేయర్, మైకో, టాటా, జేకే, కావేరి, నూజివీడు,  యుస్ అగ్రోస్, రాశి, సన్బిజ్, హైగ్రో సీడ్స్, అంకుర్, గార్డెన్ సీడ్స్, టయో సీడ్స్,  ప్రభాకర్ లాంటి ప్రముఖ సీడ్  కంపెనీల హవా నడుస్తోంది. చిన్నాచితకా కంపెనీలు కూడా ఇదే బాట పడుతున్నాయి.  వీటిపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఏటా రేట్లు పెంచుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అన్నిరకాల విత్తనాలపై 10 నుంచి 15 శాతం వరకు రేట్లు పెంచాయి. ప్రొడక్షన్  కాస్ట్  పెరిగినందునే సీడ్ కాస్ట్ పెంచాల్సి వచ్చిందని సీడ్  కంపెనీలు చెబుతున్నాయి.

చేదెక్కిన స్వీట్ కార్న్

రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో స్వీట్ కార్న్  సాగవుతోంది. ప్రధానంగా హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న సిద్దిపేట జిల్లాలో యేటా సుమారు 15 వేల ఎకరాల్లో దీనిని పండిస్తున్నారు.  ఇటీవల జిల్లాలో స్వీట్ కార్న్  ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కాగా, సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. కానీ వీటి సీడ్ ధర కంట్రోల్ లో ఉండడం లేదు. ఎకరా స్వీట్ కార్న్ సాగు చేయాలంటే మూడు కేజీల సీడ్  కావాలి. గతంలో కేజీ ప్యాకెట్ రూ.2 వేలకు అటు ఇటుగా ఉండగా, ప్రస్తుతం రూ.2500కు చేరింది.  అంటే ఎకరంలో స్వీట్ కార్న్  సాగు చేసే రైతు రూ.1500 వరకు అదనంగా పెట్టాల్సి వస్తోంది. అంటే ఒక్క సిద్దిపేట జిల్లా రైతులపైనే కేవలం విత్తనాల రూపంలో రూ. 2.25 కోట్ల భారం పడుతోంది.

నాలుగు లక్షల ఎకరాల్లో సాగు

రాష్ట్రవ్యాప్తంగా రైతులు టమాట, వంకాయ, చిక్కుడు,  బెండ,  బీర్నీస్‌‌‌‌, కాకర, బీర, సొర, కీరదోస లాంటి కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. బావులు, బోర్లలో నీళ్లు ఉండడంతో ఈ యాసంగిలో సుమారు 4 లక్షల ఎకరాల్లో వివిధ కూరగాయలు పండించినట్లు హార్టీకల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. కూరగాయ రైతులకు ఏ కాలంలో నష్టం వచ్చినా ఎండాకాలంలో మాత్రం లాభాలు వచ్చేవి. కానీ ఈసారి సీన్  రివర్స్  అయింది. నార్మల్ గా మార్చి నుంచి జూన్  వరకు కూరగాయల ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ కరోనా లాక్ డౌన్  వల్ల ట్రాన్స్ పోర్ట్ సరిగ్గా లేకపోవడం, హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడంతో జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ రేట్లు తగ్గాయి. లాక్ డౌన్ కు ముందు మార్కెట్ లో కేజీ రూ.50 వరకు పలికిన టమాట ఇప్పుడు రూ.10 దాటడం లేదు. అది వ్యాపారుల రేటుకాగా, రైతులకు రూ.2, రూ.3, మహా అయితే రూ.5కు మించి దక్కడం లేదు.  చిక్కుడు, వంకాయ, బెండ, బీర, మిర్చి.. ఇలా ఏది చూసినా మార్కెట్ లో కేజీకి రూ.20 నుంచి రూ.30 దాటట్లేదు.  జిల్లాల్లో రూ.20 లోపే పలుకుతున్నాయి. ఈ లెక్కన రైతు ధర కిలోకు రూ.5 నుంచి రూ.10 లోపే ఉంటోంది. ఆకుకూరల రేట్లు కూడా డౌన్  కావడంతో  తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో కూరగాయ రైతులకు గిట్టుబాటు కల్పించి ఆదుకోవాల్సిన సర్కారు, అలా చేయకపోగా విత్తనాల రేట్లను కూడా అందుబాటులో ఉంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఏదీ ప్రోత్సాహం?

కూరగాయలు సాగు చేయాలని ఆఫీసర్లు, లీడర్లు చెబుతున్నరు. కానీ సాగుచేసిన రైతులను మాత్రం ప్రోత్సహిస్తలేరు. బయట కూరగాయల సీడ్  రేట్లు మండిపోతున్నయి.  ప్రభుత్వం రాయితీ విత్తనాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు కంపెనీలు ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచుతున్నయి. మార్కెట్లో కూరగాయలకు ధర లేదు. ఇకనైనా సర్కారు పట్టించుకోకుంటే కూరగాయల సాగు కష్టమే.

– చెరుకు సత్తయ్య, చిన్నకోడూరు, సిద్దిపేట జిల్లా

విత్తనాల ధరలు తగ్గించాలె

కూరగాయల సీడ్  ధరలు ఏటా పెంచుతున్నరు. గతంలో సర్కారు రాయితీ విత్తనాలు ఇచ్చేది. ఇప్పుడు బంద్  చేసింది.  నాకున్న నాలుగున్నర ఎకరాల్లో సొర, బీర, కాకర పెడుతుంటా. గత సీజన్ తో పోలిస్తే విత్తనాల కోసం ఐదు వేల రూపాయలు ఎక్కువ పెట్టాను. ఇటు చూస్తే  మార్కెట్ లో కూరగాయల రేట్లు పడుతున్నయ్. ఇప్పటికైనా సర్కారు కూరగాయల రైతులకు రాయితీ విత్తనాలు ఇవ్వాలె.

– నరసింహారెడ్డి,  గౌరారం, సిద్దిపేట జిల్లా

Latest Updates