ప్రైవేటు హాస్పిటల్స్​కు కరోనా కష్టాలు

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా అన్ని రంగాలనూ అతలాకుతలం చేస్తోంది. వైరస్‌‌పై పోరాటంలో ముందున్న వైద్యరంగం సైతం మహమ్మారి దెబ్బకు కుదేలవుతోంది. లాక్‌‌డౌన్‌‌తో చిన్న చిన్న హాస్పిటళ్లు నడుపుకునే డాక్టర్లకు నష్టాలు మొదలయ్యాయి. నిత్యం పేషెంట్లతో రద్దీగా ఉండే దవాఖాన్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నయి. లాక్‌‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఓపీ నాలుగైదు శాతానికి పడిపోయింది. హాస్పిటళ్ల ఇన్‌‌కమ్ పూర్తిగా తగ్గిపోయింది. రాష్ర్టంలో 6 వేల హాస్పిటళ్లు ఉండగా, ఇందులో 50 బెడ్లలోపు కెపాసిటీ ఉన్నవే 4 వేల వరకూ ఉంటాయి. వీటిల్లో మెజారిటీ అద్దె భవనాల్లో నడుస్తున్నవే. హాస్పిటల్ నడిచినా, నడవకపోయిన అద్దె, మెయింటెనెన్స్‌‌ తప్పదు. ఈ పరిస్థితి ఇంకెంత కాలం ఉంటుందోనని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఒకట్రెండు నెలలు పరిస్థితి ఇలాగే ఉంటే చిన్న నర్సింగ్ హోమ్స్‌‌లో సగం మూతపడుతాయని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

జీతాల్లో కోత

కరోనా భయంతో పేషెంట్లు లేక చాలా హాస్పిటళ్లు పూర్తిగా బంద్ ఉంటున్నయి. ఎమర్జెన్సీ కేసులు తీసుకుంటున్న హాస్పిటల్స్ సైతం తక్కువ సిబ్బందితో నడుస్తున్నయి. మార్చి 22న లాక్‌‌డౌన్ మొదలైనప్పటికీ మెజారిటీ హాస్పిటళ్లు సిబ్బందికి ఆ నెల పూర్తి జీతాలు చెల్లించాయి. కొన్ని దవాఖాన్లలో మాత్రం పది శాతం వరకు కోత పెట్టారు. అయితే ఈ నెల శాలరీ విషయంలో మాత్రం భారీగా కోతలు పడే అవకాశాలు కనిపిస్తున్నయి. ఆదాయం ఒకట్రెండు శాతానికి పడిపోవడం, మెయింటెనెన్స్‌‌ భారం మీద పడడంతో జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారిందని దవాఖాన్ల యజమానులు చెబుతున్నారు.

ఉద్యోగాలూ కోల్పేయే ప్రమాదం

వచ్చే నెలలో లాక్‌‌డౌన్‌‌ ఎత్తేసినా.. ఈ 45 రోజుల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నష్టాలను తగ్గించుకునేందుకు కొంతమంది సిబ్బందిని తగ్గించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే చాలా యాజమాన్యాలు విధులకు రావొద్దని నర్సులు ఇతర సిబ్బందికి సూచించాయి.

Latest Updates