కరోనా టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల పర్సంటేజీల దందా

  • కరోనా లాస్ ను కవర్ చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
  • పీఆర్వోలు, ఏజెంట్లు పల్లెల్లోకి
  •  ఆర్ఎంపీలకు 20-30 శాతం షేర్
  •  తమ హాస్పిటళ్లకే రెఫర్ చేయాలని ఒప్పందాలు
  •  కరోనా టైం లాస్ ను కవర్ చేసేందుకు ముందస్తుగా ప్లాన్

 

వరంగల్: ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.. ఇటు సీజనల్ వ్యాధులు.. అటు కరోనా విజృంభణ .. ఇదివ రకు ఏ చిన్న రోగం వచ్చినా జనాలు ఎంజీఎం పరుగులు తీసేవారు. కానీ అక్కడ కరోనా పేషెంట్లు ఉండటం.. రోజు రోజుకూ కేసులు ఎక్కు వవుతుండడంతో ఇప్పుడు అక్కడికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా నేరుగా ఎంజీఎం వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే లాక్ డౌన్ తో మొన్నటి వరకు బంద్ చేసి ఉన్న హాస్పిటళ్లు సడలింపుల్లో భాగంగా తెరుచుకున్నాయి. రెండు నెలలు క్లోజ్ చేసి ఉండటంతో బిల్డింగ్ రెంట్ లు, ఇతర బిల్లుల భారం ఎక్కువైంది. దీంతో కరోనా టైంలో వచ్చిన లాస్ ను కవర్ చేసుకునేందుకు హాస్పిటళ్లు పీఆర్వోలు, ఏజెంట్లను మళ్లీ రంగంలోకి దించాయి. గ్రామాల్లో ఏ చిన్న జబ్బు చేసినా స్థానిక ఆర్ ఎంపీలు, పీఎంపీలు పేషెంట్లను తమ హాస్పిటల్ కే పంపించేలా బేరాలాడుతున్నాయి. ఒక్కో పేషెంట్ కు 20 నుంచి 30 శాతం కమీషన్ ఇస్తామని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో ఆ భారమంతా కూడా మళ్లీ పేషెంట్ల పైనే పడుతోంది.

20 నుంచి 30 శాతం వారికే..

గ్రేటర్ పరిధిలో 150కి పైగా పెద్ద పెద్ద హాస్పిటళ్లు ఉన్నాయి. కరోనా వల్ల ఇప్పటికే అన్ని రకాల హాస్పిటల్స్ ఓపీ ఫీజులు పెంచాయి. ఇది వరకు ఉన్న రేటు కంటే రూ.100 నుంచి రూ.200 వరకు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ ఎంపీ రెఫర్ తో వస్తుండటంతో ప్రైవేట్ హాస్పిటళ్లు మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. ప్రతి పేషెంట్ కు 20 నుంచి 30 శాతం కమీషన్ ఇస్తామని చెబుతున్నాయి. ఇందుకు ఓపీ ఎంట్రీతో మొదలు టెస్టులు, మెడిసిన్ బిల్లులు ఎక్కువగా వసూలు చేస్తుండటంతో ఆ భారమంతా మళ్లీ రోగులపైనే పడుతోంది.

ఇష్టా రీతిన బిల్లులు

‘తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్-2002’ ప్రకారం హాస్పిటల్స్ ఓనర్లు తాము అందించే సేవలకు నిర్ణయించిన ఫీజుల వివరాల పట్టికను అందరికీ కనిపించేలా పెట్టాలి . గ్రేటర్ వరంగల్లోనే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏ హాస్పిటల్లోనూ ఇలాంటి బోర్డులే కనిపించవు. దీంతో హాస్పిటల్స్ ఇష్టారీతిన బిల్లులు వసూలు చేస్తూ పేద పేషెంట్లను దోచుకుంటున్నాయి. అందులోనూ ఆర్ఎంపీలు, పీఎంపీలకు కమీషన్ ఇచ్చేందుకు అధిక బిల్లులు వేస్తున్నాయి. ఫలితంగా పేద పేషెంట్లకు ఆర్థికం గా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నబిల్లుల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు.

గ్రామీణ ప్రాంతాలే టార్గెట్

గ్రేటర్ పరిధిలో ఇప్పుడంతా కరోనా భయం నెలకొంది. రోజుకు కనీసం 10 కేసులు నమోదు అవుతుండడంతో జనాలు హైరాన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటళ్లు తమ పీఆర్వోలు, ఏజెంట్లకు టార్గెట్లు ఇస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు లాంటి కరోనా సంబంధ లక్షణాలు ఉన్న వారిని కాకుండా ఇతర సమస్యలు, రోగాలు ఉన్నవారిని తమ హాస్పిటల్స్ కు రప్పించుకునేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇందుకు గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీలు, పీఎంపీలకు కమీషన్ల వల విసురుతున్నాయి. దీంతో తమకు ఎక్కువగా కమీషన్ ఇచ్చే హాస్పిటళ్లకు పేషెంట్లను రిఫర్ చేస్తున్నారు.