ప్రైవేటు హాస్పిటల్స్​లో కరోనా బెడ్లు ఫుల్​

  • పది రోజుల్లోనే 2 వేల మంది అడ్మిట్
  • సింప్టమ్స్ లేకున్నా అనుమానంతో హాస్పిటళ్లలో ఉంటున్న కొందరు..
  • అవసరమైన పేషెంట్లకు దొరకని బెడ్లు
  • ఆగని ప్రైవేటు దోపిడీ.. జనరల్ వార్డుకే సర్కారీ ప్యాకేజీ
  • ఐసీయూ, వెంటిలేటర్‌‌‌‌ ట్రీట్​మెంట్​కు లక్షల్లో బిల్లులు

సిఫార్సు  ఉంటేనే

గడిచిన రెండు వారాల్లో రాష్ట్రంలో సుమారు ఆరు వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎసింప్టమాటిక్‌‌, సాధారణ లక్షణాలు ఉన్నవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లు ఇంట్లోనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏమవుతుందోనన్న భయంతో చాలా మంది ప్రైవేట్ హాస్పిటళ్ల బాట పడుతున్నారు. ‘బెడ్లు ఫుల్ అయినయ్​.. సివియర్ పేషెంట్లను మాత్రమే చేర్చుకుంటం’ అని ప్రైవేటు హాస్పిటళ్లవాళ్లు చెప్పినా పేషెంట్లు వినడం లేదు. కొంతమందైతే లీడర్లు, వీఐపీలతో రికమండేషన్లు చేయించుకొని అడ్మిట్​ అవుతున్నారు. వైరస్ లక్షణాలు తగ్గిన తర్వాత డిశ్చార్జ్ అవ్వాలని హాస్పిటళ్లు చెబుతున్నా చాలా మంది ఒప్పుకోవడం లేదు. వీరి వల్ల సివియర్​ పేషెంట్లకు బెడ్లు దొరకడం లేదు.

హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్​మెంట్​ అందిస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లలో దాదాపు బెడ్లన్నీ ఫుల్​ అయిపోయాయి. గడిచిన 10 రోజుల్లోనే సుమారు 2 వేల మందికిపైగా హైదరాబాద్‌‌‌‌లోని కార్పొరేట్ హాస్పిటళ్లలో అడ్మిట్ అయ్యారు. ఇందులో పాజిటివ్​ పేషెంట్లు కొందరైతే.. లక్షణాలు లేకున్నా ముందస్తు జాగ్రత్తగా అడ్మిట్​ అయినవాళ్లు ఇంకొందరు ఉన్నారు.

బెడ్ల కోసం వెయిటింగ్​ లిస్టు

రాష్ట్రంలో సుమారు 30 ప్రైవేటు హాస్పిటళ్లు కరోనా ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నాయి. ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో కొన్ని హాస్పిటళ్లు యాభైలోపు, మరికొన్ని హాస్పిటళ్లు వందలోపు, ఇంకొన్ని హాస్పిటళ్లు 200లోపు కరోనా బెడ్లు ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం మెజారిటీ హాస్పిటళ్లలో బెడ్లు నిండిపోయాయి. కిమ్స్‌‌లో కరోనా పేషెంట్ల కోసం దాదాపు రెండొందల బెడ్లు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం అక్కడ 160 మంది ట్రీట్​మెంట్​ పొందుతున్నట్లు ఆ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. యశోద, అపోలో, కేర్, సన్‌‌షైన్‌‌ సహా పెద్ద దవాఖాన్లలో అన్నింటిలో ఇదే పరిస్థితి ఉంది. బంజారాహిల్స్‌‌లోని ఓ హాస్పిటల్ వెయిటింగ్ లిస్ట్‌‌ కూడా మెయింటెయిన్ చేస్తున్నది.

సివియర్​ కండిషన్​ వాళ్లకు కష్టాలు

లక్షణాలు లేకున్నా ముందస్తు జాగ్రత్తగా ప్రైవేటు హాస్పిటళ్లలో కొందరు చేరిపోవడంతో.. సివియర్ కండిషన్‌‌ పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైరస్ లక్షణాలు ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిని బుధవారం గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లగా.. అక్కడ బెడ్లు ఫుల్‌‌ అని చెప్పారు. అక్కడి డాక్టర్లు ఇచ్చిన సమాచారంతో మరో ఆరు హాస్పిటళ్లలో ఎంక్వైరీ చేయగా, అన్నింటిలో ఫుల్​ అనే సమాధానం వచ్చింది. చివరికి అదే హాస్పిటల్‌‌లో పేషెంట్‌‌ను అడ్జస్ట్ చేశారు.

జనరల్ వార్డుకే సర్కార్‌‌‌‌ ప్యాకేజీ

కరోనా పేషెంట్ల ట్రీట్‌‌మెంట్ కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు ప్రైవేటు, కార్పొరేట్‌‌ దవాఖాన్లలో అమలు కావడం లేదు. ఐసీయూ, వెంటిలేటర్‌‌‌‌కు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌‌లోని ఓ హాస్పిటల్‌‌లో నల్గొండ జిల్లాకు చెందిన పేషెంట్‌‌కు రూ.14 లక్షల 57వేలు బిల్లు వేశారు. జనరల్ వార్డుకు మాత్రమే ప్రభుత్వ ప్రకటించిన చార్జీలు వర్తిస్తాయని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌‌ అసోసియేషన్‌‌ ప్రతినిధులు రెండ్రోజుల కింద ప్రెస్​మీట్​లో వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.

హోమ్‌‌ ఐసోలేషన్‌‌కు ప్యాకేజీలు

హోమ్‌‌ క్వారంటైన్, హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉంటున్న పేషెంట్ల కోసం కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటల్స్‌‌ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. 15 రోజుల కోసం రూ. 10 వేల నుంచి 20 వేలు చార్జ్ చేస్తున్నాయి. ఈ ప్యాకేజీ తీసుకున్నవారికి పల్స్ ఆక్సిమీటర్‌‌‌‌, డిజిటల్ థర్మో మీటర్‌‌‌‌, మాస్కులు, గ్లవ్స్‌‌లు ఇస్తున్నారు. రెండ్రోజులకు ఓసారి డాక్టర్‌‌‌‌తో వీడియో కాల్‌‌లో మాట్లాడిస్తున్నారు. నర్సులు, ఇతర టెక్నీషియన్లతో రోజూ మాట్లాడిస్తున్నారు. మందులు ఎలా వాడాలి? ఏం తినాలి? వంటివన్నీ డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్ని హాస్పిటళ్లయితే.. కరోనా లక్షణాలతో హోమ్‌‌ క్వారంటైన్‌‌లో ఉంటున్నవాళ్లకు, వైరస్ ముప్పు ఎక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల కోసం కూడా ఇలాంటి ప్యాకేజీలను తీసుకొచ్చాయి. హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నవాళ్లను వైద్యారోగ్యశాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో చాలా మంది పేషెంట్లు ప్రైవేటు హాస్పిటళ్ల ప్యాకేజీలు తీసుకుంటున్నారు.

ఇన్నాళ్లు గాలికొదిలేసి టిమ్స్ పై ఇప్పుడు హడావుడి

Latest Updates