ఆన్​లైన్​ క్లాసెస్​కు రెడీ.. పిల్లలకూ స్మార్ట్​ ఫోన్‍ కొనియ్యాలె

వరంగల్‍రూరల్‍, వెలుగుపిల్లలు ఇంట్లో సెల్‍ఫోన్​పట్టుకుంటే ఇన్నాళ్లూ కోపం చేసిన పేరేంట్స్..  ఇప్పుడు రూ.10వేలు అప్పు చేసైనా సరే, వారికి  ఓ స్మార్ట్​ ఫోన్​ సెపరేట్​గా కొనివ్వాలె. అంతేనా? దానికి నెట్‍ కనెక్షన్‍కూడా పెట్టించాలె. ఓ గదిలో వారు అదే పనిగా నాలుగైదు గంటలు దానిని పట్టుకొని కూర్చుంటే మధ్యమధ్యలో పెద్దలే జ్యూస్​ లేదంటే బూస్ట్​ అందించాలె. ఎందుకంటే కరోనా కారణంగా అనేక ప్రైవేట్​ స్కూళ్లు ఆన్​లైన్​ క్లాసెస్​కు రెడీ అవుతున్నయి. కొన్నిచోట్ల  ఇప్పటికే ఆన్​లైన్​ లెస్సన్స్​​ స్టార్ట్​ చేసినయ్​. ఏ కాస్త  లేటైనా  మధ్యలో పాఠాలు మిస్సయితయని స్టూడెంట్స్​ కంటే ముందే పేరెంట్స్​అగులుబుగులైతున్నరు. కానీ చేద్దామంటే పనులు లేని, జీతాలు పూర్తిగా రాని లాక్​డౌన్​ కష్టకాలంలో  రూ.10వేలు పెట్టి స్మార్ట్​ఫోన్​ కొనడం కామన్​ పేరెంట్స్​కు కాస్త కష్టమైన పనే.

ఇండ్లలోనే రెండు నెలలు..

మార్చి నెల అంటేనే స్కూళ్లు, స్టూడెంట్స్​కు ఎంతో విలువైన టైం.ఆ నెలలోనే ఎగ్జామ్స్ ​టైం టేబుల్స్​ రావడంతోపాటు ప్రిపరేషన్స్​ స్టార్టవుతాయి. టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​ అయితే ఫుల్లు బిజీ అయిపోతారు. కానీ కరోనా కారణంగా సర్కారు మార్చి 15 నుంచి నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.  ఆపై లాక్‍డౌన్‍ మొదలవడంతో హాలీడేస్ అలాగే కంటిన్యూ అయ్యాయి. క్లాసులు, పరీక్షలు ఎక్కడికక్కడే ఆగాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి చదివే  విద్యార్థులందరికీ ఎటువంటి పరీక్షలు పెట్టకుండానే పైతరగతులకు ప్రమోట్‍చేయాలని ఆర్డర్​ వేసింది. పదో తరగతి పిల్లలకు మాత్రం యథావిధిగా ఎగ్జామ్స్​కండక్ట్ చేసేలా ప్లాన్‍రూపొందించింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‍ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా  ప్రధాన  ప్రైవేటు స్కూళ్లన్ని ఆన్‍లైన్‍క్లాసులు చెప్పడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. కొన్ని స్కూళ్లలో ఇప్పటికే  క్లాసెస్​ మొదలయ్యాయి.

యాప్​లు, ఐడీలు..

పిల్లల విషయంలో స్మార్టు ఫోన్​ అంటే నిన్నటి వరకు యూట్యూబ్‍లో కార్టూన్లు, పబ్జీ ఆటలు, నచ్చిన సినిమాలు చూడటానికి పనికొచ్చే ఆట వస్తువు. ఇప్పుడు  అవే ఫోన్లు, ల్యాప్‍టాప్‍లు సైన్స్​, మ్యాథ్స్​ క్లాసులు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ప్రైవేట్​ స్కూళ్లన్నీ ఒక్కొక్కటిగా తమ విద్యార్థులకు ఆన్‍లైన్‍క్లాసులు మొదలుపెడుతున్నాయి. ‘ఫ్లిప్​లర్న్​’ వంటి యాప్‍లను అందుబాటులోకి తెస్తున్నాయి. పాఠాలు వినడానికి ఒక్కో స్టూడెంట్‍కు ఒక్కో ఐడీ, పాస్‍వర్డ్​ రూపొందించి అందిస్తున్నాయి.  తరగతుల వారీగా  స్టూడెంట్లను సెక్షన్లు, గ్రూపులా వారీగా వేరుచేస్తున్నాయి. హైదరాబాద్​, వరంగల్​, కరీంనగర్​ లాంటి సిటీల్లో అనేక స్కూళ్లు మార్నింగ్​9 గంటల నుంచి  మధ్యాహ్నం ఒకటి వరకు ఈ తరహా ఆన్​లైన్​టీచింగ్​ నడుపుతున్నాయి. ఇక్కడి వరకుబాగానే ఉన్నా ఇక ప్రతి స్టూడెంట్​కు స్మార్ట్​ఫోన్​, ట్యాబ్‍ కంపల్సరీ కానుంది.

కొత్త ఫోన్‍ అంటే..రూ.10 వేల ఖర్చు

తమ పిల్లలకు స్కూళ్లు ఆన్‍లైన్​ క్లాసులు చెబుతాయని తెలియగానే  మొదట ఖుషీ అయిన పేరెంట్స్​కు ఇప్పుడు సరికొత్త సమస్య వచ్చింది.  ఈ రోజుల్లో ఏ ఇంట్లో అయినా స్మార్ట్‍ఫోన్‍ఉండటం సాధారణమే కావొచ్చు. కానీ, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మధ్యలో అంతరాయం లేకుండా ప్రతిరోజు తమ పిల్లలకు ఫోన్‍ఇవ్వడమే కష్టం. ఒకవేళ ఇచ్చినా మధ్యలో ఫోన్‍వస్తే క్లాస్‍మధ్యలో చిన్నారుల  ఏకాగ్రత దెబ్బతింటుంది. సమస్య ఏదో ఒకరోజు అన్నట్లుగా కాదు. కనీసం నాలుగైదు నెలలైనా ఆన్‍లైన్​క్లాసులు నడిచే చాన్స్​ ఉంటుందని స్కూల్‍ మేనేజ్‍మెంట్స్​ చెబుతున్నాయి. ఈ క్రమంలో నెట్‍సౌకర్యం ఉండి.. పిల్లల కళ్లపై ప్రభావం చూపని రీతిలో ఉండే మొబైల్‍ ఇవ్వాల్సిందే. అంటే..కరోనా కష్టకాలంలో  తక్కువలో తక్కువ రూ.8  వేల నుంచి 10 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీనికి నెట్‍ సదుపాయం అదనం. ఇదే ఇప్పుడు  కామన్​ పేరెంట్స్​కు కష్టంగా మారింది. కరోనా కారణంగా చేతిలో పైసలు లేవనీ, కానీ పిల్లల చదువు కోసం అప్పు చేసైనా స్మార్ట్​ఫోన్​ కొనక తప్పేలా లేదంటున్నారు.

స్టూడెంట్స్​ క్లాసులు మిస్​ కావొద్దనే..

కరోనా నేపథ్యంలో ఇప్పట్లో తరగతి గదుల్లో క్లాసులు చెప్పే పరిస్థితులు లేవు. మా స్టూడెంట్లు వారి క్లాసులు మిస్సవకూడదని ఆన్‍లైన్‍క్లాసులు మొదలుపెట్టాం. వేలాది మందికి ఈ తరహా పాఠాలు చెప్పడానికి ప్రతి ఒక్కరికి అవసరమైన ఐడీ, పాస్‍వర్డ్‍, యాప్‍ తయారు చేయించాం. ఆన్‍లైన్‍క్లాసుల విషయంలో  మేనేజ్‍మెంట్‍తరఫున మావంతు సహకారం  అందిస్తాం. అదే సమయంలో పిల్లలకు మేం చెప్పే క్లాసులు అర్థమయ్యేలా అవసరమైన స్మార్ట్‍ఫోన్‍, ట్యాబ్‍, ల్యాప్‍టాప్‍అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత పేరేంట్స్​ఉంది.

‑ కొండల్‍రెడ్డి (ఏకశిల స్కూల్‍ డైరెక్టర్‍)

గల్ఫ్ లో కార్మికుడికి రూ.2లక్షల ఫైన్

Latest Updates