జూరాల ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తివేత

ఆల్మట్టి నుండి భారీగా వస్తున్న వరద

రాత్రికి మరింత పెరిగే అవకాశం

మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుండి జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా కొనసాగుతుండడంతో ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తివేశారు. ఆల్మట్టి నుండి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో వస్తున్న నీటిని వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో ఇన్ ఫ్లో లక్షా 90 వేల క్యూసెక్కులు ఉండగా.. ప్రస్తుతం మధ్యాహ్నం 3 గంటలకు ఇన్  ఫ్లో: 2,10,000 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 28 గేట్లు ఎత్తి 2,25,493 క్యూసెక్కులు దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం  9.657 టీఎంసీలు కాగా..  ప్రస్తుత నీటి నిల్వ 8.473  టీఎంసీలకు చేరుకుంది. గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గత వారం రోజులుగా కాలువలకు విడుదల చేస్తున్నారు. అయితే వరద బాగా పెరగడంతో గేట్లు ఎత్తాల్సి వచ్చింది. జూరాల పూర్తి స్థాయి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.850 మీటర్లు ఉంది. ఎగువన ఉన్న జల విద్యుత్ కేంద్రంలో… 5  యూనిట్లలో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా.. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల నుండి 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడంతో దిగువ కృష్ణా నది పరివాహక ప్రాంతాలు.. అనుబంధ ప్రాజెక్టులు, కాలువల పరిసర ప్రాంతాల వారికి హెచ్చరికలు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

Latest Updates