జూరాల ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత..

కృష్ణా నదిలో పరవళ్లు తొక్కుతున్న వరద

నిరంతరాయంగా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

 మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద పరవళ్లుతొక్కుతోంది. ఎగువన ఆల్మట్టి.. నారాయణపూర్ ల నుండి జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.  స్ధానిక వర్షాల వరద కూడా తోడవడంతో జూరాల ప్రాజెక్టు వద్ద  20 గేట్లు ఎత్తివేశారు. వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రాజెక్టు ఎగువ..  దిగువన.. ఉన్న విద్యుత్ కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

నిన్నటి నుండి వరద క్రమంగా పెరుగుతోంది. ఆల్మట్టి వద్ద ఇన్ ఫ్లో ఒక లక్షా 28 వేల క్యూసెక్కులు ఉండగా.. 1 లక్ష 8వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే నారాయణపూ ర్ వద్ద లక్షా 19వేలు ఉండగా.. లక్షా 25వేలకు పైగా క్యూసెక్కులు దిగువన జూరాలకు విడుదల చేస్తున్నారు. దీంతో  ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఇన్ ఫ్లో లక్ష 60 వేల క్యూసెక్కులకు చేరుకుంది. వరద ఉధృతి ఒక్కసారిగా 35 వేలకుపైగా క్యూసెక్కులు పెరగడంతో జూరాల ప్రాజెక్టు వద్ద మొత్తం 20 గేట్లు ఎత్తేశారు. దిగువన ఉన్న కాలువలు.. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం లక్ష 65 వేల క్యూక్కులు విడుదల చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి 8.571 టీఎంసీలను నిల్వ ఉంచుతూ.. వస్తున్న వరదను వస్తున్నట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317.980 మీటర్లు ఉంది. నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వస్తున్న వరదను వస్తున్నట్లే గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. మరో మూడు రోజుల వరకు వరద పరవళ్లు కొనసాగే అవకాశం ఉండడంతో.. అధికారులు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

Latest Updates