భర్త గెలుపు కోసం భార్య బిజీబిజీ

‘ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉంటుంది’ అనేది పెద్దల మాట. ఆ విషయాన్ని మధ్యప్రదేశ్‌లోని గుణ సిట్టింగ్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శిని సింధియా ప్రూవ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సింధియాకు వెస్ట్రన్‌ యూపీ బాధ్యతలు అప్పగించింది. దీంతో అక్కడ బిజీగా ఉన్న సింధియా గెలుపు కోసం భార్య ప్రియదర్శిని తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రచారం భారాన్ని తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిలో జోష్‌ పెంచుతున్నారు. గుణ స్థానాన్ని  పదిలంగా ఉంచుకునేందుకు.. గతంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒకరితో మాట్లాడుతున్నారు.  ప్రజల అవసరాలను తెలుసుకుని వాటి అమలుకు కృషి చేస్తామని హామీలు ఇస్తున్నారు. దీంతో ప్రియదర్శిని త్వరలో రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

1952 నుంచి సింధియా ఫ్యామిలీదే అధికారం

1952 నుంచి ఇప్పటి వరకు గుణ సీటును సింధియా ఫ్యామిలీ 14సార్లు గెలిచింది. జ్యోతిరాదిత్య సింధియా 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2014లో దాదాపు లక్ష మెజారిటీతో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో గుణ, చింద్వారా స్థానాలను మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్‌ ప్రస్తుతం వాటితో పాటు మరికొన్ని స్థానాల్లో గెలవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్‌ను కొనసాగించాలని చూస్తోంది.

గెలుపు మాదే.. బీజేపీ

అసెంబ్లీ ఎన్నికల్లో గ్వాలియర్‌‌ – చంబల్‌ రీజియన్‌లో  పుంజుకున్న కాంగ్రెస్‌ గుణ స్థానంలో మాత్రం కొంత వెనుక బడింది. గుణ సెగ్మెంట్‌లోని ఎనిమిది స్థానాల్లో ఐదు స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌కు మిగతా స్థానాల్లో బీజేపీ కంటే 16వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి వచ్చిన కేపి. యాదవ్‌ను ఆ పార్టీ బరిలోకి దించింది. దీంతో జ్యోతిరాదిత్య సింధియా గెలుపు కష్టమని, తామే గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది. మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశానికి మంచిదని, జ్యోతి రాదిత్య సింధియా ఎటువంటి అభివృద్ధి చేయలేదని యాదవ్‌ చెప్పారు. సింధియా కుటుంబానికి కంచుకోట అయిన గుణ స్థానంలో ఈ నెల 12న పోలింగ్‌ జరగనుంది.

Latest Updates