పాములతో ఆటలాడిన  ప్రియాంక గాంధీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. గురువారం సరదాగా పాములతో ఆడుకుంటూ హాల్ చల్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఓ బహిరంగ సభ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పాములు ఆడించేవారు అక్కడికి రావడంతో… ప్రియాంక గాంధీ వారిని కలుసుకుని ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి దగ్గర ఉన్న పాములను పట్టుకుని కాసేపు ఆడుకున్నారు. పాములతో జాగ్రత్తగా ఉండమంటూ అక్కడున్న వారు ఆమెతో చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. అయితే ప్రియాంక మాత్రం ‘‘ఏంకాదు.. పర్లేదు…’’ అంటూ పాములను పట్టుకున్నారు.

ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా ఆమె పాములవారికి దగ్గరగా కూర్చుని, ఓ పామును తన చేతుల్లోకి తీసుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతంలోని ప్రజల పరిస్థితులను పాములవారిని అడిగి తెలుసుకున్న ప్రియాంక… వాళ్ల దగ్గర ఏమేం పాములున్నాయో అడిగి వాటన్నిటినీ చూశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ… ‘‘బీజేపీ సిద్ధాంతానికి, కాంగ్రెస్ సిద్ధాంతానికి చాలా తేడా ఉంది. మేము వారితో నిరంతరం పోరాడతాం. రాజకీయాల్లో వాళ్లే మా విరోధులు. బీజేపీ ఏ మార్గంలోనూ లబ్ధి చేరకుండా అన్ని దారులూ మూసేశాం. మేము గట్టిగా పోరాడుతున్నాం. మా అభ్యర్థులంతా బలవంతులే….’’ అని తెలిపారు.

Latest Updates