కాశీలో గుంతల రోడ్లు భలే : మోడీపై ప్రియాంక సెటైర్లు

గోరఖ్‌‌పూర్‌‌/ రాయ్‌‌బరేలీ:  ‘గంగాయాత్రతో ప్రచారం మొదలుపెట్టి వారణాసి వచ్చా. మోడీ పాలనలో కాశీ అద్భుతంగా ఉంటుందనుకున్నా. కానీ ఇక్కడి రోడ్లకున్న గుంతలు చూస్తే అర్థమవుతోంది బీజేపీ సర్కారు పనితీరేంటో’ అని కాంగ్రెస్‌‌ జనరల్‌‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. వాళ్ల అభివృద్ధి అడ్వర్టైజ్‌‌మెంట్స్‌‌లో బాగా కనబడుతుందని చురకలంటించారు. మోడీది మజ్బూత్‌‌ సర్కారు కాదని.. పొగరుబోతు (మగ్రూర్‌‌) సర్కారని విమర్శించారు. ఆ పొగరుబోతుతనం బీజేపీ పార్టీ నేతల మాటల్లో రోజూ కనబడుతూనే ఉంటుందన్నారు. హక్కుల కోసం పోరాడే వాళ్లను ‘యాంటీ నేషనల్‌‌’ అంటూ జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌‌లోని డియోరియాలో సలెంపూర్‌‌ కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ రాజేశ్‌‌ మిశ్రాకు మద్దతుగా బుధవారం ప్రియాంక ప్రచారం చేశారు.

‘చైనా, జపాన్‌‌, చివరికి పాకిస్థాన్‌‌లోనూ ప్రధాని మోడీ బిర్యానీ తింటూ ఎంజాయ్‌‌ చేయడం మీరు చూసుంటారు. కానీ సమస్యలతో అల్లాడుతున్న పేదోళ్ల గడప తొక్కడం చూశారా’ అని ప్రజలను ప్రియాంక ప్రశ్నించారు. ‘మోడీకి 56 అంగుళాల ఛాతీ ఉంది సరే. మరి దేశంలో రైతుల పరిస్థితి ఎందుకు దయనీయంగా ఉంది’ అని అడిగారు. ‘ఐదేళ్లలో 11 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ మోడీ సర్కారు పట్టించుకోదు. ఇంటికెళ్లి చెబితేనైనా వింటారేమోనని రైతులు ఆయన దగ్గరకే వచ్చారు. కానీ మోడీ గ్రాండ్‌‌ బంగ్లా దాటి బయటకు రాలేదు’ అని నిప్పులు చెరిగారు. ప్రజలతో ప్రధాని కలవడం లేదని విమర్శించారు. ‘ఇండస్ట్రియలిస్టుల రూ. కోట్ల అప్పులను మాఫీ చేశారు. రైతులకూ అలాగే రుణమాఫీ చేయరేం’ అని నిలదీశారు.

ఇదేం ప్రజాస్వామ్యం?

రాయ్‌‌బరేలీ ఎమ్మెల్యే అదితీసింగ్‌‌, జిల్లా పంచాయతీ మెంబ్లర్లపై దాడిని ప్రియాంక ఖండించారు. ‘ఇదేం ప్రజాస్వామ్యం. రాళ్లు, కత్తులతో వెంటాడి మరీ దాడి చేయడమా? రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఇక్కడి బీజేపీ సర్కారు బొమ్మలా చూస్తోంది. దీనిపై గవర్నర్‌‌‌‌, ఎన్నికల కమిషన్‌‌కు కంప్లైంట్‌‌ చేస్తాం’ అని పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నారు. బీజేపీ లోక్‌‌సభ క్యాండిడేట్‌‌ దినేశ్‌‌ సింగ్‌‌ తమ్ముడు, జిల్లా పరిషత్‌‌ చైర్మన్‌‌ అవదేశ్‌‌ ప్రతాప్‌‌సింగ్‌‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌‌ను పరిశీలించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే, పరిషత్‌‌ మెంబర్లపై మంగళవారం రాత్రి దాడి జరిగింది. దీంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడిందని, అదితీకి స్వల్ప గాయాలయ్యాయని కార్యకర్తలు చెప్పారు.