మందు తాగించి : షాద్ నగర్ డాక్టర్ హత్యలో నమ్మలేని నిజాలు

హైదరాబాద్, వెలుగు: మహిళా వెటర్నరీ డాక్టర్​ను నిందితులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఆమెను సజీవంగానే దహనం చేసినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలికి వాళ్లు మందు తాగించి పలుసార్లు రేప్​ చేశారు. లారీ క్యాబిన్​లోనూ అఘాయిత్యానికి ఒడిగట్టారు. పక్కా ప్లాన్​ ప్రకారం ట్రాప్​ చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. శనివారం  నిందితులను  జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించి పోలీసులు.. రిమాండ్ డైరీలో కీలక వివరాలు  వెల్లడించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

పక్కా ప్లాన్​

బుధవారం సాయంత్రం శంషాబాద్​లోని ఇంటి నుంచి స్కూటీపై బయటకు వచ్చిన వెటర్నరీ డాక్టర్​.. సాయంత్రం  6.08 గంటలకు తొండుపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. అక్కడి సిబ్బంది స్కూటీని టోల్​ప్లాజా వద్ద పార్క్ చేయొద్దని చెప్పడంతో ఆమె కాంపౌండ్ వాల్ వద్ద 6.13 గంటల స్కూటీని పార్క్ చేసి క్యాబ్ లో గచ్చిబౌలి వెళ్లారు.  ఆ తర్వాత  రాత్రి 9.13 గంటలకు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే మద్యం తాగుతూ అక్కడే ఉన్న ఆరిఫ్​ గ్యాంగ్​ ప్లాన్​ ప్రకారం స్కూటీ వెనుక టైర్ లో గాలితీసింది. టైర్లో గాలి లేకపోవడాన్ని గమనించిన బాధితురాలు రాత్రి 9.19 గంటలకు చెల్లెలికి ఫోన్​ చేసి విషయం చెప్పారు.

MORE NEWS:

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

ప్రియాంక ఎలా చనిపోయిందో తల్లికి చెప్పిన ఆరిఫ్

అదేసమయంలో ఆరిఫ్​ ఆమె దగ్గరకు వచ్చి.. పంక్చర్ వేయిస్తామని నమ్మబలికాడు.  స్కూటీని శివకు ఇచ్చిపంపాడు. ఈ క్రమంలో ఆరిఫ్​ ఫోన్ నంబర్​ను బాధితురాలు తీసుకొని అక్కడే వెయిట్ చేశారు. అయితే తమ ప్లాన్​లో భాగంగా ఆమెకు కొద్ది దూరంలో ఆరిఫ్​ నిల్చోగా.. నవీన్, చెన్నకేశవులు తమపై అనుమానం రాకుండా లారీలో కూర్చున్నారు. ఆ ఇద్దరూ లారీలో నుంచి తనవైపు చూస్తుండడంతో రాత్రి 9.22 గంటలకు భయంతో చెల్లికి మరోసారి బాధితురాలు ఫోన్ చేశారు. ఇది గమనించిన ఆరిఫ్ మిగితా ముగ్గురిని అలెర్ట్ చేశాడు. ఈ క్రమంలోనే పంక్చర్ వేయిస్తానని చెప్పి స్కూటీ తీసుకెళ్లిన శివ రాత్రి 9.23గంటలకు తిరిగి వచ్చి.. షాప్స్ క్లోజ్ అయ్యాయని  చెప్పాడు. వేరే  వైపు  షాప్​లు ఉంటాయని అటు పంపించాడు.

మందు తాగించి..

చెల్లితో ఫోన్​లో మాట్లాడి కట్ చేసిన తర్వాత తన స్కూటీ కోసం ఆరిఫ్​కు బాధితురాలు ఫోన్​ చేశారు. బైక్ రిపేర్ చేయించుకుని శివ కాంపౌండ్ వాల్  రెండో  గేట్ వద్దకు వస్తున్నాడని ఆరిఫ్​ నమ్మించాడు. ఇదే సమయంలో ఆరిఫ్, నవీన్, చెన్నకేశవులు ముగ్గురు వెళ్లి రెండో గేట్ వద్ద నిల్చున్నారు. రాత్రి 9.35 గంటల ప్రాంతంలో బాధితురాలిని ముగ్గురు కలిసి కాంపౌండ్ వాల్ లోని నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లారు. హెల్ప్ హెల్ప్ అని ఆమె అరవడంతో నోటిని ఆరిఫ్ గట్టిగా మూసేశాడు. బాధితురాలి ఫోన్​ లాక్కుని స్విచ్ ఆఫ్ చేశాడు. నలుగురు ఆమెపై దాడి చేసి అత్యాచారం జరిపారు. ఈ క్రమంలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మద్యం తాగించి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

లారీ క్యాబిన్​లోనూ..

అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని నిందితులు వివస్త్రను చేసి లారీ క్యాబిన్​లో ఎక్కించారు. అక్కడి నుంచి రాత్రి 10.28 గంటలకు లారీలో బయలుదేరారు. లారీ ముందు స్కూటీపై శివ, నవీన్ వెళ్తూ పరిసరాలను గమనిస్తుండగా.. లారీ క్యాబిన్ లోనే  బాధితురాలిపై ఆరిఫ్​, చెన్నకేశవులు పలుమార్లు అత్యాచారం జరిపారు. ఆ తర్వాత చటాన్ పల్లి అండర్ పాస్ బ్రిడ్జి కింద పెట్రోల్​ పోసి దహనం చేశారు. అయితే బాధితురాలిని సజీవంగానే దహనం చేసినట్లు తెలుస్తోంది. ప్రాణంతోనే ఉందని అనుకున్న నిందితులు మరోసారి వెనక్కి వచ్చి పూర్తిగా తగులబడిందో లేదో చెక్ చేసుకున్నారు.

Latest Updates