అసలు మగవాళ్లు మృగాలుగా ఎందుకు మారుతున్నారు..?

నెత్తురు మరుగుతోంది. ఆగ్రహంతో కన్నీళ్లు జాలువారుతున్నాయి. కడుపులో దుఃఖం సుడులు తిరుగుతోంది. తెలియని నిస్సహాయత గుండెను మెలిపెడుతోంది. వెటర్నరీ డాక్టర్‌ స్థానంలో రక్తసంబంధీకులు ఎవరైనా ఉంటే…! ఈ ఊహ నా ప్రాణాలను ఆవిరిచేస్తోంది.

అసలు మగవాళ్లు మృగాలుగా ఎందుకు మారుతున్నారు? సాటి మనిషిపై మాటలకందని దారుణానికి ఎందుకు పాల్పడుతున్నారు? బాధితుల ప్రవర్తన, వారి డ్రెస్సింగ్, లేట్‌ నైట్‌కూడా బయట కనిపించడం… ఇవి కారణాలా? వెటర్నరీ డాక్టర్‌ విషయంలో ఇవేవీ కారణాలు కాదు. ఆమె ఒంటరిగా, నిస్సహాయంగా ఉండటమూ కారణం కాదు. ఆమె మహిళ కావడమే కారణం. ఒక ప్లాన్‌ ప్రకారం సాయం చేస్తున్నట్టు నమ్మించి, వంచించి, అపహరించి, రేప్‌ చేసి, పెట్రోల్‌ పోసి కాల్చి చంపేశారు. ఇంత దుర్మార్గానికి తెగబడి, ఏమీ ఎరగనట్టుగా, రోజువారీ పనేదో చేసినట్టుగా, మామూలుగా ఇళ్లకు వెళ్లిపోయారు? ఎంత రాక్షసత్వం. దీన్ని అంతం చేయడం ఎలా?

బాధితుల పట్ల వాళ్లు ఎంత క్రూరంగా ప్రవరిస్తున్నారో… అంతే క్రూరంగా అలాంటి మనుష్యులను మట్టుబెట్టాలా? ఇన్​స్టెంట్​ జస్టిస్​ ఒక్కటే మార్గమా? అలాగయితే, సాధారణ మనుషుల నుంచి వాళ్లను వేరు చేసి ఎలా గుర్తుపట్టాలి? వరంగల్‌లో ఇద్దరమ్మాయిలపై 2008లో జరిగిన యాసిడ్‌ దాడి తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ గుర్తొచ్చింది. అయితే, దానివల్ల పరిస్థితి మారిందా?

నిర్భయ కేసులో యావత్‌ దేశం ఒక్కటై నిల్చింది. దోషులకు మరణశిక్ష పడింది. కానీ, ఇప్పటివరకు శిక్ష అమలే కాలేదు. కథువాలో 10 ఏళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి బంధించి, పదే పదే రేప్‌ చేసి, హింసించి, అత్యంత దారుణంగా చంపారు. ఆ పాప ఒక మతానికి చెందినది కావడం, నేరగాళ్లది ఒక మతం కావడంతో మొత్తం వ్యవహారానికి మతం రంగు పులిమారు. నిందితుల్లో ఒకరు నిర్దోషిగా బయటకొచ్చారు. మరికొందరికి శిక్ష పడింది. అయితే, ఈ  కేసు విచారణ సందర్భంగా సాక్షులను హింసించి నేరం ఒప్పుకునేలా చేశారన్న ఆరోపణలతో సిట్‌పై కేసు పెట్టాల్సిందిగా ఒక కోర్టు ఇటీవలనే ఆదేశించింది. ఇప్పుడేమవుతుంది?  నేరగాళ్లు దర్జాగా బయటకొచ్చి పూలమాలలు వేయించుకున్నా మనం చూస్తూ ఉండాల్సిందేనా? కథువా తర్వాత సూరత్‌. తన దగ్గర కూలీలుగా చేరిన తల్లీబిడ్డలను సెక్స్‌ పావులుగా వాడుకున్న కాంట్రాక్టర్‌ మొదట తల్లిని చంపాడు. తర్వాత కూతుర్ని పలుమార్లు  రేప్‌ చేసి చంపాడు. ఈ కేసు ఏమైందో తెలియదు.

దోషులను అక్కడికక్కడే శిక్షించే ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ వల్ల ఇటువంటి సంఘటలను మళ్లీ మళ్లీ జరగవన్న గ్యారంటీ మాత్రం లేదు. నేర విచారణ, శిక్షలు వేయడంలో జరిగే జాప్యంవల్ల మన దేశంలో  చట్టం పట్ల భయం లేకుండా పోయింది. తప్పు చేసి దొరికినా తప్పించుకోవచ్చనే ధీమా మళ్లీ మళ్లీ తప్పులు చేయడానికి అవకాశం ఇస్తోంది. దీన్ని సరిదిద్దాలి. ఆడవాళ్లను సాటి మనుషులుగా కాకుండా కేవలం సెక్స్‌ ఆబ్జెక్ట్‌గా చూసే దృష్టి  వల్లనే రేప్‌లు జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థల్లోనూ మహిళల పట్ల వివక్షతో కూడిన దృష్టి ఉంది. ఇదీ పోవాలి. ఈ రెండూ జరిగితేనే మార్పు సాధ్యం.

– వేములపాటి అజయ్‌ కుమార్‌,

ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్

చూపులు మింగేస్తాయి

హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ ఇన్సిడెంట్‌. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆ అమ్మాయి భయాన్ని చెప్పుకోవాలి. చెల్లెలికి ఫోన్​ చేస్తే…  టోల్‌ బూత్‌ దగ్గరకు వెళ్లి నిలబడమని ఆమె సలహా ఇచ్చింది. అక్కడ అందరి చూపులూ తనపైనే ఉంటాయన్న కారణంతో ఆ అమ్మాయి తటపటాయించింది. మగాళ్ల చూపులతో ఆడవాళ్లందరిలోనూ ఏర్పడిన అభద్రత ఆమెను బలి తీసుకుంది.  స్త్రీలకు రాత్రిళ్లు మాత్రమే కాదు పగలు కూడా  భద్రత లేదు. నిర్మానుష్య ప్రాంతాల్లోనూ, రద్దీ బజార్లలోనూ భయాలే. బస్సు, విమానం, రైలు… ఎక్కడైనా సరే మహిళలకు సెక్యూరిటీ లేదన్నది వాస్తవం. ఈ ఇన్‌సెక్యూరిటీకి కారణం సాటి మనుషులే.

Latest Updates