గూడు పోతుందేమోనని..గుండె ఆగింది

ఖమ్మం, వెలుగుప్రత్యామ్నాయం చూపించకుండానే ఖమ్మంలోని గోళ్లపాడు ఛానెల్ నిర్వాసితుల ఇండ్లను  కూల్చివేయడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు యశోదమ్మ సోమవారం గుండెపోటుతో చనిపోయారు. నగరంలోని 41, 42 డివిజన్లలో గోళ్లపాడు చానెల్ ఆధునికీకరణలో భాగంగా ఛానెల్ ను ఆనుకొని ఉన్న గుడిసెలు, ఇండ్లను ఆఫీసర్లు కూల్చివేస్తున్నారు. ఇండ్ల పట్టాలు ఇచ్చిన  వెలుగుమట్లలో సౌకర్యాలు కల్పించిన తర్వాతే నిర్వాసితులను తరలించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఆదేశించినా.. స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్వాసితులపై ఒత్తిడి తెచ్చి, అక్కడి నుంచి తరలిస్తున్నారు. సోమవారం నాడు తహశీల్దార్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ భర్త వీరభద్రం ఆధ్వర్యంలో పంపింగ్ వెల్ రోడ్​లో కూల్చివేతలను మొదలుపెట్టారు. తమ ఇంటిని కూడా కూల్చివేస్తారని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన యళ్లబోయిన యశోదమ్మ గుండెపోటుతో చనిపోయారు.

దీంతో అధికారులు కూల్చివేతలను నిలిపివేసి వెళ్లిపోయారు. యశోదమ్మ చనిపోయిన సంగతి తెల్సి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డితో పాటు సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు అక్కడికి చేరుకున్నారు. యశోదమ్మ మరణానికి  తహసీల్దార్ శ్రీలత, కార్పొరేటర్ భర్త తోట వీరభద్రం  కారణమని ఆమె కొడుకు భాస్కర్​తోపాటు స్థానికులు ఆరోపించారు. నిర్వాసితులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏసీపీ వెంకట్ రెడ్డి బీజేపీ, ఎన్డీ లీడర్లతో చర్చలు జరిపారు. మృతురాలి కుమారుడు భాస్కర్ నుంచి కంప్లయింట్​ తీసుకుని.. బాధ్యులపై  కేసు పెడతామని హామీ ఇచ్చారు.  తాజా ఘటన గురించి కమీషన్ సభ్యులు తల్లోజు ఆచారికి శ్రీధర్ రెడ్డి వివరించారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చిన ఆచారి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. తహశీల్దార్ శ్రీలత తో పాటు బాధ్యులందరి మీద హత్యా నేరం క్రింద కేసు నమోదు చేయాలని, మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి  కోరారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

గోళ్లపాడు నిర్వాసిత మహిళ మృతికి కారణమైన  పోలీసులు, తహసీల్దార్, టీఆర్​ఎస్​ నాయకులపై చర్యలు తీసుకోవాలి.   తాళాలు వేసి ఉన్న ఇండ్లను కూల్చటం ఏంటి, ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టి కి తీసుకెళ్లాము.శాసనసభలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన హామీ ఇచ్చారు.  నిర్వాసితుల సమస్య ను శాంతియుతంగా పరిష్కరించాలి.

‑ బీజేపీ రాష్ట్ర కోర్​ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్​ రెడ్డి

Latest Updates