ఓయూలో అధ్యాపకుల కొరత: పట్టించుకునే నాథుడే లేడు

దేశానికి ఎందరో మేధావులను అందించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. అంతటి పేరున్న ఈ యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత ఉంది. వందలాది మంది అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఏళ్ళ తరబడి ప్రొఫెసర్లు లేకున్నా అలాగే నెట్టుకొస్తున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో సగానికి పైగా అధ్యాపకులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీలో 12వందల మంది టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలి. కానీ రెగ్యులర్ అధ్యాపకులు 5వందల మంది మాత్రమే ఉన్నారు. మిగితా పోస్టుల్లో కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ అధ్యాపకులతో నడిపిస్తున్నారు. గవర్నర్ ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటికీ అధ్యాపకులను భర్తీ చేయలేదు. ఇక కొన్ని డిపార్ట్ మెంట్స్ లో HODలు కూడా లేని పరిస్ధితి ఉంది.

ఏదో ఒక కారణంతో అధ్యాపకుల నియామక ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు యూనివర్సిటీ అధికారులు.  పోస్ట్ ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చి నిబంధనలు రూపొందించినా.. సమయానికి భర్తీ ప్రక్రియ చేపట్టడం లేదు. అదే టైంలోనే రిజర్వేషన్ల అంశం కోర్ట్ కెక్కడం .. డిపార్ట్ మెంట్ల వారీగా నియామక ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రిక్రూట్ మెంట్ ప్రక్రియ పెండింగ్ లో పడింది. యూజీసీ నుంచి ఉత్తర్వాలు వచ్చే వరకు నియామక ప్రక్రియ చేపట్టొద్దని చెప్పడంతో.. అధ్యాపకుల నియామకం ఎప్పుడు జరుగుతుందో స్పష్టత రావడం లేదు. ఇక ఖాళీలు ఉన్నది వాస్తవమని ఒప్పుకుంటూనే.. బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. విద్యాసంవత్సరాలు గడుస్తున్నాయే తప్ప అధ్యాపకుల పోస్టుల భర్తీ మాత్రం జరగటం లేదంటున్నారు విద్యార్థులు.

 

Latest Updates