ఇటు కృష్ణమ్మ..అటు గోదారమ్మ కదిలొచ్చినయ్​

కృష్ణ:

జూరాలకు 1.23 లక్షల క్యూసెక్కుల వరద

రేపు ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం

గోదావరి:

కడెంకు 23,889 క్యూసెక్కుల ఇన్ఫ్లో

పొంగుతున్న తాలిపేరు, గౌతమి

హైదరాబాద్‌, వెలుగు:కృష్ణమ్మ ఉరకలు.. గోదారమ్మ పరవళ్లతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. అటు ఎగువ ప్రాంతాల్లో, ఇటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం తొణికిసలాడుతోంది. సాగు పనులు జోరందుకున్నాయి. కృష్ణా జలాలు సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(పీజేపీ)కు చేరాయి. నారాయణపూర్‌ నుంచి ప్రస్తుతం వస్తున్న 1.23 లక్షల క్యూసెక్కుల ప్రవాహం మరో 16–17 గంటలు కొనసాగితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. అయితే డ్యామ్‌ నీటిమట్టం సగానికిపైగా చేరిన వెంటనే పవర్‌హౌస్‌ ద్వారా కరెంట్‌ ఉత్పత్తి ప్రారంభించి నీటిని దిగువకు వదలనున్నారు. బుధవారం  జూరాల గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేసే అవకాశముంది. గోదావరి బేసిన్‌లోని కడెం ప్రాజెక్టుకు 23,889 క్యూసెక్కుల వరద వస్తోంది. తాలిపేరు, గౌతమి నుంచి భారీ వరద కొనసాగుతుండడంతో సోమవారం సాయంత్రం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 24 అడుగులకు చేరింది.

కృష్ణా బేసిన్‌కు జలకళ

కర్నాటక, మహారాష్ట్రలో వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు 88 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టు నీటి నిల్వ 124.50 టీఎంసీలకు చేరింది. మరో నాలుగు టీఎంసీలు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి 48,820 క్యూసెక్కులు, పవర్‌హౌస్‌ ద్వారా 42 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు దాదాపు నిండింది. ప్రాజెక్టుకు 1.32 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. దీంతో సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి 20 గేట్లు ఎత్తి 1.23 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. ఉజ్జయిని ప్రాజెక్టుకు సోమవారం ఉదయం 82,407 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి 35 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 117.24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 60 టీఎంసీల నీళ్లు చేరాయి. కర్నాటక హోసపేటెలోని తుంగభద్ర నదిపై ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు 14,683 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యామ్‌ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24.80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 588 క్యూసెక్కులు, నాగార్జున సాగర్‌కు 631 క్యూసెక్కుల వరద వస్తోంది.

రేపు జూరాల గేట్లు ఎత్తివేత

ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు గేట్లను బుధవారం ఎత్తే అవకాశముంది. జూరాల నిండిన వెంటనే అటు పవర్‌హౌస్‌, ఇటు స్పిల్‌ వే ద్వారా సుమారు లక్ష క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు వదిలేందుకు అధికారులు రెడీ అవుతున్నరు. లోయర్‌ జూరాలను దాటి కృష్ణా నీళ్లు గురువారం రాత్రికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే అవకాశముంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.04 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులో కనీస నీటి మట్టం చేరగానే భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ఇంజినీర్లు సమాయత్తమవుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఇంకా వర్షాలు కురిసే అవకాశముండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి మంచి ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఆగస్టు రెండో వారం నాటికి సాగర్‌కు భారీ ఇన్‌ఫ్లోలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు, జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టుకు ఖరీఫ్‌కు డోకా ఉండదని లెక్కలు వేస్తున్నారు.

గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం

గోదావరి బేసిన్‌లో కడెం ప్రాజెక్టుకు 23,889 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 7.60 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.77 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. మరో రోజు ఇదే స్థాయిలో ఇన్‌ ఫ్లోస్‌ కొనసాగితే కడెం ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లికి వరద మొదలయ్యే అవకాశముంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం ఉదయం 5 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా రాత్రి 9 గంటలకు వరద పూర్తిగా బంద్‌ అయ్యింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.64 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. మహారాష్ట్రలోని గైక్వాడ్‌ ప్రాజెక్టుకు 20,792 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, సింగూరుకు 15 క్యూసెక్కులు, నిజాం సాగర్‌కు 55 క్యూసెక్కులు, ఎస్సారెస్పీకి 377 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరిలో ప్రాణహిత ద్వారా 9,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, నాలుగు మోటార్ల ద్వారా 8,800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలకు ప్రస్తుతం 4.45 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. అన్నారం బ్యారేజీకి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.77 టీఎంసీలున్నాయి. 3 పంపుల ద్వారా 9 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. సుందిళ్ల బ్యారేజీ కెపాసిటీ 8.83 టీఎంసీలకు 5.46 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. బ్యారేజీలోకి అన్నారం బ్యారేజీ ద్వారా 9 వేల క్యూసెక్కులు, ఎగువన కురిసిన వర్షాలతో 3,269 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. సుందిళ్ల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఎల్లంపల్లికి ఒక మోటార్‌ ద్వారా నీటిని పంప్‌ చేసేందుకు ఇంజినీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Latest Updates