పంచాయతీ కార్యదర్శులకు త్వరలో ప్రమోషన్లు!

గ్రేడ్–4కు ప్రమోట్ చేసే యోచనలో ప్రభుత్వం

ప్రొబేషన్​ పీరియడ్‌ను రెండేండ్లకు తగ్గించే చాన్స్

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు (జేపీఎస్​లు) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో వీరికి గ్రేడ్––4  జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్​ ఇస్తారని సమాచారం.  ప్రొబేషన్​ పీరియడ్ ను 3 ఏళ్ల నుంచి రెండెళ్ల వరకు తగ్గించే ప్రపోజల్స్​ ఉన్నాయి. దీనిపై ఈనెలఖారులోగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని సమాచారం. త్వరలో పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సీఎం జరిపే సమావేశంలో జేపీఎస్​ల సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈనెలాఖరు కల్లా ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయని, వచ్చే నెలలో జేపీఎస్​ల ప్రమోషన్లపై నిర్ణయం తీసుకునే చాన్స్​ ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

పల్లె ప్రగతి సక్సెస్

రాష్ట్ర వ్యాప్తంగా 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం 2018 డిసెంబర్ లో భర్తీ చేసింది. వరుస ఎన్నికల కారణంగా వీళ్లు 2019 మే నెలలో డ్యూటీలో చేరారు. అదే ఏడాది సెప్టెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో రెండో దశ పల్లె ప్రగతి నిర్వహించింది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతమైంది. అన్ని గ్రామాల్లో ఈ స్కీమ్ అమలు తరువాత చాలా మార్పులు కనిపించాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించారు. తరువాత హరిత హారం, నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, గ్రామ సభలు, యాప్ ల నిర్వహణ, నాన్ అగ్రికల్చర్ ఆస్తుల సర్వే, రిజిస్ట్రేషన్ ఇలా అన్ని అంశాలలో జేపీఎస్ ల పనితీరుపై సీఎం కేసీఆర్ సంతృప్తిగా ఉన్నట్లు పంచాయతీ రాజ్ ఆఫీసర్లు చెబుతున్నారు. ‘‘ జేపీఎస్ ల పనితీరుపై సీఎం సానుకూలంగా ఉన్నారు. ఐఏఎస్ , ఐపీఎస్ ఆఫీసర్లు గ్రామాల్లో పర్యటించిన టైమ్ లో ప్రభుత్వానికి జేపీఎస్ లపై మంచి రిపోర్టును అందజేశారు. త్వరలో ప్రభుత్వం జేపీఎస్ లపై సానుకూల నిర్ణయం తీసుకుంటుంది. ఎవరూ ఆందోళన చెందొద్దు’’ అని ఉన్నతాధికారి తెలిపారు.

మా సమస్యలు ప్రస్తావించండి

గత డిసెంబరు 31న సీఎం ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. పీఆర్సీ, రిటైర్ మెంట్ ఏజ్ , ప్రమోషన్లపై చర్చించారు. అప్పటి నుంచి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల నుంచి టీఎన్జీవో, టీజీవో, జేఏసీ లీడర్లకు ఫోన్లు వస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ నేతలు సైతం మంత్రి ఎర్రబెల్లి, సీఎస్ సోమేశ్‌ కుమార్, పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్, కమిషనర్ రఘనందన్ రావును కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు.

జాబ్స్ వదిలేస్తున్నరు

పని ఒత్తిడి , జీతం రూ.15వేలే ఇవ్వడం,  వేధింపులు, షోకాజ్ నోటీసులు, కొత్త నోటిఫికేషన్లు రావడం.. ఇలా పలు కారణాలతో జేపీఎస్​లు జాబ్​లు వదిలేస్తున్నారు. పని ఒత్తిడితో కొందరు మహిళా కార్యదర్శులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయడం కష్టంగా  మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామాలు ఉండగా జూనియర్లు,  జీపీఎస్​లు 10 వేల మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 50వేల జాబ్స్​ భర్తీ  చేయనుంది. దీంతో పెద్ద ఎత్తున జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సెలవుపై వెళుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ , నల్గొండ జిల్లాలో వెయ్యి మంది సెలవు పెట్టారు. మరికొంత మంది లాంగ్ లీవ్ తీసుకున్నారు. ప్రకటన రాకముందే ఇలా ఉంటే నోటిఫికేషన్లు విడుదల అయితే మరింత మంది జాబ్​ను వదిలేసే చాన్స్‌ ఉంది.

కార్యదర్శుల డిమాండ్లు ఇవీ

ప్రొబేషన్​ టైమ్ ను 3 నుంచి రెండేళ్లకు తగ్గించాలి.

జీతాన్ని రూ.15000 నుంచి రూ.25 వేలకు పెంచాలి.

వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి,  జాబ్ టైమింగ్స్ ఖరారు చేయాలి.

ఉపాధి హామీ పనుల  నుంచి మినహాయింపు ఇవ్వాలి.

పంచాయతీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.

For More News..

ఢిల్లీ పోయొచ్చినంక కేసీఆర్ మారిండు!

ప్రతిపక్ష నేతలకు మంత్రి ఈటల సవాల్‌‌

తమ్మీ..! పార్టీ మారకుండ్రి.. అనుచరులకు ఫోన్లు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

మగాళ్లకూ ‘ఫెర్టిలిటీ సెంటర్లు’.. మారిన లైఫ్‌స్టైలే కారణం

Latest Updates