
- హైదరాబాద్‌లోని హెచ్ఎంలకు మాత్రమే ఎంఈఓలుగా ప్రమోషన్
- విద్యాశాఖ సమీక్షలో సర్కారు నిర్ణయాలు
- ఈ నెలాఖరులోగా ప్రమోషన్లు ఇస్తామన్న మంత్రి సబిత
హైదరాబాద్, వెలుగు: టీచర్లకు ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన ప్రమోషన్లు ఇవ్వాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎంఈఓ ప్రమోషన్లకు అడ్డంకులు లేని హైదరాబాద్‌లో హెచ్ఎంలకు మొదట ఇవ్వాలని, మిగిలిన జిల్లాల్లోని హెడ్మాస్టర్లకు తర్వాత ఇవ్వాలని భావిస్తోంది. ప్రమోషన్లు, ఇతర అంశాలపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్‌తో పాటు విద్యాశాఖ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా తయారు చేసిన రిపోర్టును నేడో, రేపో సీఎం కేసీఆర్‌కు అందించనున్నారు. ఐదేండ్ల నుంచి టీచర్లకు ప్రమోషన్లు లేక వేలాది సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం వచ్చాక 2015 జులైలో తొలిసారి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇచ్చారు. 2018లో కేవలం ట్రాన్స్ఫర్లు మాత్రమే చేసి, వివిధ కారణాలతో ప్రమోషన్లు ఆపేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలుగా ఉండగా… వాటిలో 31 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉంది.
టీచర్లంతా పాత పది జిల్లాల పరిధిలోనే పనిచేస్తున్నారు. లొకాలిటీ ఇష్యూ వస్తుందనే ఆందోళన ఉన్నా, ఇప్పటికే పలు శాఖలు ఉమ్మడి జిల్లాల ప్రకారం ప్రమోషన్లు ఇచ్చాయి. టీచర్ల ప్రమోషన్లనూ అదే పద్ధతిలో ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వెంటనే సీరియారిటీ లిస్టులు రెడీ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది.
ఏడు వేలమంది ఎస్జీటీలకు ఎస్‌ఏగా ప్రమోషన్…
ఉమ్మడి జిల్లాల వారీగా ప్రమోషన్లు ఇస్తే దాదాపు తొమ్మిది వేల మందికి మేలు జరిగే అవకాశముంది. ఏడు వేలమంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, 1,500 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు వస్తాయి. హెడ్మాస్టర్లకు ఎంఈఓలుగా ప్రమోషన్ ఇవ్వడంపై కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతానికి కేవలం హైదరాబాద్‌లోని పనిచేసే హెడ్మాస్టర్లకు మాత్రమే డిప్యూటీ ఐఓఎస్(ఎంఈఓ)గా ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. బడులను తెరవడం, మిడ్ డే మీల్స్ తదితర అంశాలపైనా రివ్యూ మీటింగ్‌లో చర్చ జరిగిందని వెల్లడించారు. ఈనెలాఖరులోగా ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పీఆర్టీయూ లీడర్లు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.