కొత్త విద్యుత్ బిల్లు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం

హైదరాబాద్‌‌, వెలుగు:కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌‌ సవరణ ముసాయిదా బిల్లు ఫెడరల్‌‌ స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్న ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్​ డిమాండ్​ చేశారు. కొత్త విద్యుత్ బిల్లుపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ సీఎం కేసీఆర్​ ఓ లేఖ రాశారు. ఈ బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

  • ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌‌ కు సంబంధించి ఈఆర్‌‌సీని కేంద్రమే ఏర్పాటు చేయాలనే నిబంధన రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తాం.
  • జల, పవన, సోలార్‌‌ విద్యుత్‌‌  ఉత్పత్తిపై ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన విధానం రాష్ట్రాల అనుమతితో రూపొందాలి. ఫైన్​ లేకుండా నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉండాలి.
  • రాష్ట్రాలకు ప్రత్యేక లోడ్‌‌ డిస్పాచ్‌‌ సెంటర్లు ఉన్నాయి. ఎన్‌‌ఎల్‌‌డీసీకే విశేష అధికారాలు అప్పగించి వాళ్ల ఆర్డర్‌‌ ప్రకారమే విద్యుత్‌‌ సరఫరా చేయాలనే నిబంధనల వల్ల ఎన్‌‌టీపీసీలాంటి సంస్థలతో పోటీపడలేక రాష్ట్రంలోని విద్యుత్‌‌ ఉత్పత్తి కేంద్రాలు వెనకబడిపోతాయి. ట్రాన్స్​మిషన్ నిర్ణయాలు ఎస్‌‌ఎల్‌‌డీసీలకే వదిలేయాలి. ఎస్‌‌ఎల్‌‌డీసీలపై ఎన్‌‌ఎల్‌‌డీసీ పెత్తనం సరికాదు. షెడ్యూలింగ్, గ్రిడ్ స్థిరత్వం వంటి వాటికే ఎన్‌‌ఎల్‌‌డీసీని పరిమితం చేయాలి.
  • ఒక మెగావాట్‌‌ కంటే ఎక్కువ విద్యుత్‌‌ వినియోగించే సంస్థలు ఓపెన్‌‌ యాక్సెస్‌‌ కు వెళ్లొచ్చనే విధానం సరికాదు. ఓపెన్‌‌ యాక్సెస్‌‌తో డిస్కంలు నష్టపోతాయి. సబ్‌‌ లైసెన్సింగ్‌‌, లీజు విధానం డిస్కంలపై ప్రభావం చూపుతుంది.
  • డీబీటీ విధానానికి మేం పూర్తిగా వ్యతిరేకం. రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌‌  అమలు చేస్తున్నందున సబ్సిడీ విధానం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలి.
  • క్రాస్‌‌ సబ్సిడీ లేకుండా అన్ని వర్గాలకు ఒకేలా వాస్తవ విధానంతో బిల్లులు జారీ చేయాలనే నిబంధనను వ్యతిరేకిస్తున్నాం. పేదలు, రైతాంగ ప్రయోజనాలకు దీని వల్ల నష్టం కలుగుతుంది.
  • రాష్ట్రాలు కుదుర్చుకునే విద్యుత్‌‌ ఒప్పందాలపై కేంద్రం ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ అథారిటీకి అధికారాలు ఇవ్వడం సరికాదు. వీటి అధికారం రాష్ట్రాలకే ఉండాలి.

అల్లర్లు ఆపకపోతే ఆర్మీని దించుతా

Latest Updates