ఎయిర్ పోర్ట్ బంద్​.. హాంకాంగ్ లో తీవ్ర నిరసన

  •                 రెండు రోజులుగా హాంకాంగ్​లో ఫ్లైట్ల రాకపోకలు నిలిపివేత
  •                 నేరస్తుల అప్పగింత బిల్లుపై
  •                 పది వారాలుగా ఆందోళనలు
  •                 అణచేందుకు చైనా ప్రయత్నం

హాంకాంగ్: నేరస్తుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్ పౌరులు ఎయిర్ పోర్టును ముట్టడించారు. సోమవారం వేలాదిగా లోపలికి చొచ్చుకెళ్లి బైఠాయించారు. ప్రయాణికులు లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఎయిర్ పోర్టులో ఒక్క విమానమూ ల్యాండ్ కాలేదు.. ఏ విమానమూ పైకెగరలేదు. మంగళవారం కూడా ఆందోళన కొనసాగింది. ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా విమానయాన సంస్థలు వారికి వసతి ఏర్పాట్లు చేస్తాయని అధికారులు చెప్పారు.

బిల్లుపై పది వారాలుగా హాంకాంగ్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బిల్లును సస్పెండ్ చేసింది. అయితే, అధికారికంగా బిల్లును వాపస్ తీసుకోకపోవడంతో ఆందోళనలు జరుగుతూనే ఉన్నయ్. వారాంతాల్లో వేలాదిగా ఆందోళనకారులు రోడ్డెక్కుతున్నారు.

ఈ ఆందోళనను అణిచేసేందుకు చైనా సిద్ధమైంది. బీజింగ్ నుంచి భద్రతా బలగాలను పంపించింది. ఈ బలగాలు హాంకాంగ్ లో అడుగుపెడుతున్న వీడియోలను చూసి ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. బీజింగ్ తీరుపై మండిపడుతూ మరోసారి రోడ్డెక్కారు. ఆదివారం నాటి ఆందోళనల్లో పోలీసుల చేతిలో గాయపడ్డ ఓ మహిళ కంటిచూపు కోల్పోయింది. ఒక కన్ను పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో కంటికి కన్ను అంటూ ఆందోళనకారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

బ్రిటన్ నుంచి 1997లో హాంకాంగ్​ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ స్థాయిలో ఆందోళనలు జరగలేదని, బీజింగ్ పాలనకే ఇది చాలెంజ్అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాంకాంగ్ పౌరులు లక్షలాదిగా రోడ్లపైకి రావడం ఇదే తొలిసారని అంటున్నారు. అయితే, ‘నిరసన తెలపడానికి హింసను ఎంచుకోవడం సరికాదు’ అంటూ హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ చెప్పారు. ఆందోళనకారులను ఉద్దేశించి మంగళవారం ఆమె టీవీలో ప్రసంగించారు. ఆందోళనకారులు హింసను ప్రేరేపిస్తే హాంగ్ కాంగ్ తలెత్తుకోలేని స్థితిలో పడిపోతుందని హెచ్చరించారు. వారం రోజులుగా హాంగ్ కాంగ్ లో జరుగుతున్న సంఘటనలతో ఆందోళన చెందుతున్నానన్నారు. ఆమె ప్రసంగం ముగిసిన కాసేపటికే జనం హాంగ్ కాంగ్ ఎయిర్ పోర్ట్ ను నిరసనకారులు ముట్టడించారు.

Latest Updates