నిరూపిస్తే 100 గుంజీలు తీస్తా

కోల్ కతా: బెంగాల్ లో ప్రతి యేడు దుర్గ మాత పూజలను ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పండుగ సెలబ్రేషన్స్ పై సందిగ్ధం నెలకొంది. ఈ సంవత్సరం దుర్గ పూజలు ఉండబోవని బెంగాల్ ప్రభుత్వం చెప్పినట్లు పుకార్లు వస్తున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఏడాది దుర్గ పూజలు ఉండబోవని రాష్ట్ర సర్కార్ చెప్పినట్లు ఎవరైనా నిరూపిస్తే ప్రజల ఎదుట బహిరంగంగా వంద గుంజీలు తీస్తానని మమత స్పష్టం చేశారు. దీన్నో రాజకీయ పార్టీ చేస్తున్న విష ప్రచారంగా ఆమె కొట్టిపారేశారు.

‘దుర్గ పూజలపై ఒక రాజకీయ పార్టీ విష ప్రచారం చేస్తోంది. దీనిపై మేం ఎలాంటి మీటింగులు నిర్వహించలేదు. దుర్గ పూజలు ఉండబోవని బెంగాల్ గవర్నమెంట్ చెప్పినట్లు నిరూపిస్తే నేను బహిరంగంగా ప్రజల ముందు 100 గుంజీలు తీస్తా. దుర్గ పూజపై కొన్ని ఫేక్ ఐటీ పేజెస్ దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. వాళ్లను పట్టుకోవాల్సిందిగా పోలీసులకు చెబుతున్నా. కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిని పట్టుకొని గుంజీలు తీయించాలి. మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికే ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తుంటారు. కాళీ, దుర్గ, హనుమాన్ లను ఒక్కసారి కూడా పూజించని వారు పూజ గురించి మాట్లాడుతున్నారు’ అని పోలీస్ డే కార్యక్రమంలో పాల్గొన్న మమత పేర్కొన్నారు.

Latest Updates