అబ్బాయిలు పోలీస్.. అమ్మాయిలు అగ్రికల్చర్

Psychometric Test conducted in Model Schools in Telangana State
  • కెరీర్ ​ఎంపికలో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనోగతం
  • రాష్ట్రంలోని మోడల్​స్కూల్స్​లో నిర్వహించిన సర్వేలో వెల్లడి
  • 194 స్కూళ్లలో 18 వేల మంది టెన్త్ స్టూడెంట్స్​పై స్టడీ

హైదరాబాద్, వెలుగు:

పిల్లలు హైస్కూల్​స్థాయి నుంచే తమ కెరీర్​ఎంపికపై ఫోకస్ పెడుతున్నారు. స్థానిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్​ గురించి ఆలోచిస్తున్నారు. ‘మై చాయిస్​ మై ఫ్యూచర్’ పేరుతో రాష్ర్టంలోని మోడల్ స్కూళ్లలో నిర్వహించిన సైకోమెట్రిక్​ టెస్టులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయిలు ఎక్కువ మంది అగ్రికల్చర్​ అండ్ ​ఫుడ్​ రంగంలో స్థిరపడేందుకు మొగ్గుచూపగా.. అబ్బాయిలు పోలీస్​ కావాలనే కోరికను వ్యక్తపరిచారు. ఐటీ జాబ్స్​వైపు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. ఒక్కో జిల్లా స్టూడెంట్లు ఒక్కోరకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

18 వేల మందికి సైకోమెట్రిక్​టెస్ట్​

రాష్ర్టంలో 27 జిల్లాల్లో 194 మోడల్ స్కూల్స్​ఉన్నాయి. వీటిలో స్టూడెంట్ల కెరీర్ గైడెన్స్ కోసం రెండు నెలల క్రితం బోధ్​ బ్రిడ్జ్​ ఎడ్యుకేషనల్ ​సర్వీస్​ ప్రైవేటు లిమిటెడ్ ​అనే సంస్థతో విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టూడెంట్స్ మనోగతంతోపాటు వారిలో కెరీర్​పై అవగాహన పెంచేందుకు మై చాయిస్ మై ఫ్యూచర్(ఎంసీఎంఎఫ్) అనే ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేవలం మోడల్ స్కూల్స్​లోని పదో తరగతి స్టూడెంట్స్​ను ఎంచుకుంది.  అన్ని జిల్లాల పరిధిలోని 18 వేల మంది స్టూడెంట్లకు ఆన్​లైన్​లో సైకోమెట్రిక్​ టెస్ట్​ నిర్వహించింది. రెండు నెలలపాటు సాగిన ఈ ప్రోగ్రామ్​లో 200 మంది టీచర్లకూ కెరీర్ ​గైడెన్స్​పై శిక్షణ ఇచ్చారు. వారంతా ఫస్ట్​ లెవెల్​ కౌన్సెలర్లుగా విధులు నిర్వహించారు.

72 అంశాలతో సర్వే

మొత్తం 72 అంశాలతో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఓవరాల్​గా అగ్రికల్చర్​ అండ్​ ఫుడ్, పోలీస్ విభాగాల్లో పనిచేసేందుకు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆసక్తి చూపించారు. అమ్మాయిలు మెజార్టీగా అగ్రికల్చర్ అండ్ ఫుడ్, మెడికల్​ హెల్త్​కేర్ జాబ్స్​కు, అబ్బాయిలు పోలీస్, అగ్రికల్చర్ ​జాబ్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి కుటుంబ నేపథ్యమూ కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 9 శాతం మంది మాత్రమే ఐటీ జాబ్స్​చేస్తామని, 11 శాతం మంది తామే కొత్త పరిశ్రమలు స్థాపిస్తామని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్​ అవుతామని చెప్తున్న వారిలో అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు.

రిస్క్​ చేసేందుకు వెనుకంజ

కెరీర్​లో రిస్క్​చేసేందుకు స్టూడెంట్స్​పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వంద మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఆ  సాహసం చేసేందుకు ముందుకు రాగా, మరో 37 శాతం చూద్దామని, 61 శాతం మంది ఆ జోలికేపోమని పేర్కొన్నారు. దీంతో పాటు స్టూడెంట్స్​ స్వతంత్రంగా ఉండేందుకూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం 8 శాతం మంది మాత్రమే ఇండిపెండెంట్​గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

కొన్ని జిల్లాల్లో ఇలా..

ఆదిలాబాద్​లో ఎన్విరాన్​మెంటల్ సర్వీస్​, మార్కెటింగ్, పారామెడికల్ చేసేందుకు అబ్బాయిలు ముందుకు రాగా, ఎడ్యుకేషన్​ అండ్​ ట్రైనింగ్, సేల్స్, ఆర్ట్స్ డిజైన్, జర్నలిజం చేసేందుకు ఇష్టపడుతున్నట్లు అమ్మాయిలు చెప్పారు. కరీంనగర్​లో అమ్మాయిలు మార్కెటింగ్​వైపు, అబ్బాయిలు పారామెడికల్, సేల్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఖమ్మంలో సంస్థలు పెట్టేందుకు, హాస్పిటాలిటీ, టూరిజం వైపు అబ్బాయిలు, ఆర్ట్ డిజైన్, లా, హ్యూమన్​ సర్వీస్, జర్నలిజం, ఫైనాన్స్ ​రంగాలవైపు అమ్మాయిలు ఆసక్తి చూపిస్తున్నారు. మహబూబ్​నగర్​లో మార్కెటింగ్, లా, ఎడ్యుకేషన్ అండ్​ట్రైనింగ్ లాంటి జాబ్స్​చేసేందుకు అమ్మాయిలు, ఆర్కిటెక్చర్, పారామెడికల్, బిజినెస్  మేనేజ్​మెంట్​అండ్​ అడ్మినిస్ర్టేషన్​ రంగాల వైపు అబ్బాయిలు ఆసక్తి చూపిస్తున్నారు. నిజామాబాద్​లో సంస్థలు పెట్టేందుకు, డిఫెన్స్​లో చేరేందుకు అబ్బాయిలు, ఎడ్యుకేషన్​ అండ్​ ట్రైనింగ్, మెడిసిన్​ అండ్ ​హెల్త్​కేర్ రంగంవైపు వెళ్లేందుకు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపించారు.

Psychometric Test conducted in Model Schools in Telangana State

టాప్ 5 కెరీర్ లిస్టులు

అమ్మాయిల ప్రయారిటీ ఇలా..

అగ్రికల్చర్ అండ్ ​ఫుడ్​ (20%)

మెడిసిన్ అండ్​ హెల్త్‌‌కేర్ (17%)

పోలిస్​ (12%)

ఐటీ (8%)

గవర్నమెంట్ ​అండ్ ​పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్ (7%)

అబ్బాయిల ప్రయారిటీ ఇలా..

పోలిస్ (27%)

అగ్రికల్చర్ ​అండ్ ​ఫుడ్ ​(15%)

ఐటీ (11%)

స్పోర్ట్స్​(9%)

డిఫెన్స్ (7%)

Latest Updates