PUBG ఆడొద్దన్నందుకు తండ్రినే చంపేశాడు

పబ్జీ గేమ్ కి బానిసై, తల్లిదండ్రులు మందలించడం వల్ల చాలా మంది యువత తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కర్ణాటకలోని బెళగావిలో మాత్రం ఓ యువకుడు పబ్జీ ఆడొద్దని చెప్పినందుకు తన తండ్రినే అతి దారుణంగా హతమార్చాడు.

రఘువీర్ కుమార్(21)  అనే యువకుడు తరచూ మొబైల్ తోనే కాలక్షేపం చేస్తూ పబ్జీ గేమ్ ఆడేవాడు. ఈ నెల 8 న తన ఫోన్ కి రీచార్జ్ చేయాలని, లేకపోతే తాను గేమ్ ఆడలేనంటూ తండ్రి శంకరప్ప ను డబ్బులడిగాడు. అందుకు శంకరప్ప కొడుకును మందలిస్తూ డబ్బులివ్వనని తెగేసి చెప్పడంతో వారిద్దరి మధ్య ఆ రాత్రి ఘర్షణ జరిగింది. గొడవ కారణంగా తండ్రి పై కోపం పెంచుకున్న రఘువీర్  అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తండ్రి గొంతుకోసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత అతన తలను,  కాళ్లను శరీరం నుండి వేరు చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

సోమవారం తెల్లవారుజామున శంకరప్ప మృతదేహాన్ని చూసి షాకైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు గత రాత్రి జరిగిన గొడవ గురించి తెలుపగా, రఘువీరే ఈ దారుణానికి  పాల్పడి ఉండొచ్చని తెలిపారు.

శంకరప్ప పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేసేవాడు.  తన కొడుకు PUBG గేమ్ కు బానిసయ్యాడని, అందులో నుంచి తన కొడుకును ఎలా బయట పడేయాలా? అంటూ తమతో చర్చించేవాడని తోటి ఉద్యోగులు తెలిపారు. రఘువీర్ కాలేజి కి వెళ్లకుండా, ఏ పని పాటా లేకుండా ఎల్లపుడూ ఫోన్ తో ఆడుతూ కాలం గడిపేవాడని కట్కి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివానంద్ కౌజల్గి అన్నారు

ఈ కేసుపై విచారణ చేపట్టిన  కట్కీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం కల్లా పరారీలో ఉన్న రఘువీర్ ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేశారు. విచారణలో రఘువీర్  తన తండ్రిని చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. అతను హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం  చేసుకున్నామన్నారు పోలీసులు.

PUBG addiction leads to patricide, Karnataka youth beheads father