పబ్ జీ కమ్‌‌బ్యాక్‌‌కు అంత తొందరెందుకు?

న్యూఢిల్లీ: పబ్ జీ ప్రియులు తమ మొబైల్స్‌‌లో మళ్లీ ఆ గేమ్‌‌ను ఆడే చాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే వారి ఆశ తీరేలా కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం.. ఇండియాలో పబ్ జీ కమ్‌‌బ్యాక్ ఇవ్వడం కష్టమేనని తెలుస్తోంది. చైనాకు చెందిన టెన్సెంట్ నుంచి పబ్లిషింగ్ రైట్స్‌‌ను తీసుకున్నప్పటికీ ఈ పాపులర్ గేమ్ తిరిగి ఇండియాలో అందుబాటులోకి రావడం కుదరదని తెలుస్తోంది. బార్డర్‌‌లో డ్రాగన్‌‌తో వివాదంతోపాటు సెక్యూరిటీ కారణాలతో చైనాకు చెందిన 117 యాప్స్‌‌ను ఇండియా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో పాపులర్ గేమ్ అయిన పబ్ జీ కూడా ఉంది. అయితే చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీ నుంచి పబ్లిషింగ్ రైట్స్‌‌ను పబ్ జీ తిరిగి పొందడంతో ఇండియాలో ఈ గేమ్ కమ్ బ్యాక్ ఇస్తుందని అందరూ భావించారు. అయితే ఇది జరిగేలా కనిపించడం లేదు.

దేశంలో పబ్ జీని అనుమతించడానికి తొందరేమీ లేదని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వర్గాలు స్పష్టం చేయడం దీనికి ఊతం ఇస్తోంది. ‘హింసాత్మక ప్రవృత్తితో కూడిన ఈ గేమ్‌‌పై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఓనర్‌‌షిప్ రైట్స్‌‌ మారినంత మాత్రాన ఆట స్వభావం మారదు కదా’ అని మినిస్ట్రీకి చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మొబైల్స్‌‌లో పబ్ జీ తిరిగి అందుబాటులోకి రావడం కష్టంగా కనిపిస్తోంది. దీన్ని పక్కనపెడితే ఇండియాలో పబ్ జీ మొబైల్ వెర్షన్‌‌ను నిషేధించారు. కానీ వెబ్, కన్సోల్ గేమింగ్ ప్లాట్‌‌‌ఫామ్‌‌లో మాత్రం పబ్ జీ ఇంకా అందుబాటులోనే ఉంది. ఇది గేమింగ్ ప్రియులకు కొంత ఊరటగా చెప్పొచ్చు.

Latest Updates