- క్లీనింగ్,శానిటైజేషన్ చేయిస్తున్న మేనేజ్ మెంట్లు
- ఫిబ్రవరి 1 నుంచి 9,10 స్టూడెంట్స్‌కు క్లాసులు
- మొదటి రోజు 30% హాజరు కావచ్చని అంచనా
- రాని పిల్లలకు యధావిధిగా ఆన్లైన్ క్లాసులు
హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ రెడీ అవుతున్నాయి. 11 నెలల తర్వాత స్కూల్స్ మళ్ళీ షురూ కానున్నాయి. రీ ఓపెనింగ్ కోసం క్లీనింగ్, శానిటైజేషన్, స్టూడెంట్స్ వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మేనేజ్మెంట్స్ చర్యలు తీసుకుంటున్నాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 5,526 ప్రైవేటు, 2,249 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 16 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. సిటీలోని సర్కారు బడులతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ క్లాస్‌ల్లో ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ స్టాండ్స్, మాస్క్ లు వంటివి ఉండేలా మేనేజ్ మెంట్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రతి క్లాస్ లో బెంచ్ కి ఒకే స్టూడెంట్ ఉండేలా లిమిటెడ్ మెంబర్స్ తో క్లాసులు నిర్వహించనున్నాయి. స్టూడెంట్స్ ని రెండు, మూడు బ్యాచ్ లుగా డివైడ్ చేసి ఒకరోజు క్లాసు రూమ్ లో, మరో రోజు ఆన్లైన్లో క్లాసులు చెప్పనున్నాయి.
పేరెంట్స్ లో తొలగని భయం
స్కూల్స్ ఓపెన్ చేస్తే వివిధ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ వస్తుంటారు. కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎంతగా తీసుకున్నా పిల్లలను కంట్రోల్ చేయడం రిస్కేనని పేరెంట్స్ భావిస్తున్నారు. ఆ మధ్య కాలంలో స్కూల్స్ తెరిస్తే పేరెంట్స్ పిల్లలను పంపిస్తారా అనే అంశంపై కొన్ని సీబీఎస్ఈ, ప్రైవేట్ స్కూల్స్ సర్వేలు కండక్ట్ చేయగా, 80శాతం పేరెంట్స్ తమ పిల్లలను పంపమని పేర్కొన్నారు. ఆన్లైన్ క్లాసులే కంటిన్యూ చేయడం బెటర్ అని పేరెంట్స్ చెప్తున్నారు.
ఫీజు కట్టాలంటూ మెసేజ్‌లు
స్కూల్స్ లేనందున కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే అది కూడా గతేడాది ఫీజు మాత్రమే ఛార్జ్ చేయాలని గవర్నమెంట్ జీవో 46 లో పేర్కొంది. కానీ స్కూల్స్ మాత్రం ట్యూషన్ ఫీజుతో పాటు, ట్రాన్స్ పోర్ట్, ఇంటర్నెట్, లైబ్రరీ, క్యాంటీన్, వంటి ఇతరత్రా ఫీజులను కూడా జతచేసి కట్టాలని డిజిటల్ క్లాసులు ప్రారంభమైనప్పటి నుంచి పేరెంట్స్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. చాలామంది పేరెంట్స్ స్కూల్స్ ఎదుట ఆందోళన చేయడంతో పాటు విద్యాశాఖ కి కంప్లయింట్లు చేశారు. ఫీజులు కట్టకపోతే ఆన్లైన్క్లాసులు కట్ చేయడం, ఐడీలు బ్లాక్ చేయడం, టెస్ట్ లు కండక్ట్ చేస్తున్నామంటూ ఎమోషనల్ గా పేరెంట్స్ ని, స్టూడెంట్స్ ని ఆందోళనకు గురిచేశాయి. ఇప్పుడు స్కూల్స్ రీ ఓపెన్, యాన్యువల్ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడంతో ఫిబ్రవరి 1 లోపు పూర్తి ఫీజు చెల్లించాలని మేనేజ్ మెంట్లు పేరెంట్స్ కు మెసేజ్, మెయిల్స్ పంపుతున్నాయి. ఫీజు కడితేనే క్లాసులకు పర్మిషన్ ఇస్తామని బెదిరిస్తున్నాయి. దీనితోపాటు కోవిడ్ ప్రికాషన్స్ కోసం చేసే ఏర్పాట్ల ఖర్చుని కూడా స్కూల్ ఫీజులోనే యాడ్ చేసి పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేయాలని కొన్ని ప్రయివేట్ స్కూల్స్ చూస్తున్నాయి. అసలే ఫీజు భారంతో ఆందోళన చెందుతున్న పేరెంట్స్ కు ఇది అదనపు భారం కానుంది.
స్టూడెంట్స్ ని మస్ట్ గా పంపాలని..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నాం. స్టూడెంట్స్ ని మస్ట్‌గా పంపాలని ఫోర్స్ చేయడం లేదు. పేరెంట్స్ అంగీకారంతో రావాలని చెబుతున్నాం. కరోనా వ్యాక్సినేషన్ మొదలైనా పేరెంట్స్ లో ఇంకా భయం ఉంది. అందుకే పిల్లలను పంపేందుకు వెనకాడుతున్నారు. – రాధ, అకడమిక్ డైరెక్టర్, పల్లవి ఇనిస్టిట్యూషన్స్
స్కూల్ కు రాకపోయినా ఆన్ లైన్ లో
పేరెంట్స్ ఇష్టంతోనే స్టూడెంట్స్ ని అనుమతించాలని ప్రభుత్వం పేర్కొంది. యాన్యువల్ ఎగ్జామ్స్ కి అటెండెన్స్ శాతం కి సంబంధించి ఎలాంటి రూల్స్లేవని తెలిపింది. అలాగే స్కూల్ రావాలని స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదని ఇష్ట ప్రకారం గా వచ్చిన స్టూడెంట్స్ కే క్లాసులు తీసుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్కూల్ కి పంపి పిల్లలకు ఏమైనా అయితే ఇబ్బంది పడడం కంటే ఇంట్లోనే ఉంచడం బెటర్ అని చాలా మంది పేరెంట్స్ అనుకుంటున్నారు. రాని వాళ్లకు ఆన్లైన్ క్లాసులు కొనసాగించనున్నారు.