MLA సొంత ఊరిలో ముక్కబియ్యం పంపిణీ​

రేషన్ బియ్యంలో మెరిగలు, రాళ్లు

మూడు నెలలుగా నాసిరకం రైస్​ సరఫరా

ముఖం చాటేస్తున్న జనం

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

వికారాబాద్​ జిల్లా, వెలుగు: రేషన్​ బియ్యం జనాన్ని పరేషాన్​ చేస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా నాసిరకం బియ్యాన్ని గ్రామీణ ప్రజానీకానికి అంటగడుతున్నారు. అది కూడా ఒక ఎమ్మెల్యే సొంతూరులోనే ఇలాంటి సమస్య నెలకొని ఉండడం గమనార్హం. వైద్యసేవలతో ప్రజలకు దగ్గరై అధికారపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్​ మెతుకు ఆనంద్​ తన సొంతూరు కెరెళ్ళిలో ఉన్న సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతకు భిన్నంగా మెతుకు ఆనంద్​ ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో కార్పొరేటర్లు, గ్రామ సర్పంచ్​లు చేయాల్సిన పారిశుద్య పనుల్లో జోక్యం చేసుకునే ఎమ్మెల్యే తాను పుట్టిన గ్రామంలో జనం పడుతున్న ఇబ్బందులను మాత్రం గుర్తించే సమయం లేకపోవడం విచారకరమని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం ..  ధారూరు మండలంలోని కెరెళ్లి గ్రామంలో రెండు రేషన్​ దుకాణాలు ఉన్నాయి.  ఒక రేషన్​​ షాపులో 540  కార్డులు ఉండగా, మరో షాపులో 90 రేషన్​ కార్డులు ఉన్నాయి. రేషన్​కార్డు హోల్డర్లకు 140 నుంచి 170 క్వింటాళ్ల బియ్యం  వికారాబాద్​ రేషన్​ స్టాక్​ పాయింట్​ వస్తున్నాయి.  ఇంతకు ముందు ధారూరు మండల కేంద్రం నుంచి రేషన్​ బియ్యం కెరెళ్లి  గ్రామానికి సరఫరా జరిగేవి. అప్పట్లో బియ్యం ప్రతి నెల నాణ్యతతో కూడిన బియ్యం వచ్చేవి.  ముడు నెలలుగా
వికారాబాద్​ స్టాక్​ పాయింట్​ నుంచి సరఫరా అవుతున్న బియ్యం  ఏమాత్రం వినియోగానికి వీలులేకుండా ఉంటున్నాయి. ఈ బియ్యంలో ఎక్కువ బాగం రాళ్లు, మెరిగలు, దుమ్ము వంటివి ఉంటున్నాయని రేషన్​కార్డు హోల్డర్లు చెబుతున్నారు.  ఈ గ్రామానికి సరఫరా అయిన అన్ని బియ్యం బస్తాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని రేషన్​ డీలర్​ రాజ్యలక్ష్మి కూడా దృవీకరించడం గమనార్హం.

గ్రామ ప్రజలంటే చులకన

హాస్టళ్లకు, గురుకుల విద్యాలయాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్రు. గ్రామాలకు మాత్రం ముక్క బియ్యం ఇస్తున్రు. ఈ బియ్యాన్ని ఎవ్వరూ తినలేకపోతున్నారు. అన్నం వండి పశువులకు పెడితే అవికూడా తినడంలేదు. దారూర్​ నుంచి వచ్చే బియ్యాన్నే సరఫరా చేయాలి. – కె.పాండు,  కెరెళ్లి  గ్రామస్తుడు

ఎమ్మెల్యే ఊరికే దిక్కులేదు

అధికారపార్టీ ఎమ్మెల్యే సొంతూరుకే ముక్క బియ్యం ఇస్తుండ్రు. అంటే ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ అధికారులు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి గ్రామాలు ఇంకా ఎన్ని ఉన్నాయో దేవుడెరుగు. ఇప్పటికైనా మాకు మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని పంపియ్యాలి. –  తలారి నరేందర్,  కెరెళ్లి  గ్రామస్తుడు

Latest Updates