ఆర్టీసీపై సర్కారు తీరు సరికాదు..మెజారిటీ జనం అభిప్రాయం

కేసీఆర్​ సర్కారు ఆర్టీసీ సమ్మె, కార్మికుల పట్ల వ్యవహరించిన తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. సర్వేలో పాల్గొన్నవారిలో 56.6 శాతం మంది సర్కారు తీరు సరికాదని చెప్పారు. దాదాపు అన్నివర్గాల వారు, అన్ని వయసుల వారు కూడా కార్మికుల విషయంగా ప్రభుత్వ అలా వ్యవహరించాల్సింది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమ్మె సమయంలో ప్రఈత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సర్కారు విఫలమైందని, ఎన్నో ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. చివరిగా చార్జీలు పెంచడంపైనా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

రెండు నెలలు ఇబ్బందితో..

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. మొత్తం 49 వేల మందికిపైగా కార్మికులు ఈ ఏడాది అక్టోబర్​ 5వ తేదీ నుంచి సమ్మెలోకి దిగారు. దీనిపై సీఎం కేసీఆర్​ తీవ్రంగా ఆగ్రహించారు. సమ్మెలోకి వెళ్లిన కార్మికులంతా సెల్ఫ్​ డిస్మిస్​ అయినట్టేనని సీఎం ప్రకటించడంతో కార్మికులంతా ఆందోళనకు లోనయ్యారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా జేఏసీ ట్యాంక్​బండ్​పై నిర్వహించిన ‘మిలియన్​ మార్చ్​’తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమ్మె విషయంగా కోర్టు చేసిన సూచనలు కూడా పట్టించుకోకుండా సర్కారు మొండిగా వ్యవహరించింది. ఆందోళనల సమయంలో ఆత్మహత్యలు, గుండెపోట్లతో 38 మంది కార్మికులు చనిపోయారు. చాలా మంది కార్మికులు, ముఖ్యంగా మహిళా కండక్టర్లు, సిబ్బంది నిరసనల్లో గాయాలపాలయ్యారు. మొదట్లో ఆర్టీసీ సమ్మెను ప్రజలు సీరియస్​గా తీసుకోకపోయినా తర్వాత కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో సరిగా బస్సులు నడవక జనం ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి తిప్పలు తప్పలేదు. ప్రైవేటు వాహనాల అడ్డగోలు వసూళ్లతో ఇబ్బందిపడ్డారు.

ఏమేం చెప్పారు..?

  • ఆర్టీసీ సమ్మె విషయంగా సర్కారు వ్యవహరించిన తీరు సరికాదని 56.6 శాతం మంది చెప్పారు. ఇందులో సర్కారు తీరు బాధాకరమని 37 శాతం పేర్కొనగా, 14.2 శాతం మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5.4 శాతం మంది అయితే సర్కారు తీరు భయాందోళన కలిగించిందని పేర్కొన్నారు.
  • సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని 18 శాతం మంది సమర్థించారు. మరో 19 శాతం మంది సర్కారు చివరికి ఆశాజనకంగానే వ్యవహరించిందని పేర్కొన్నారు. సమర్థించిన 18 శాతంలో 4.1 శాతం మంది సర్కారు వైఖరిని గట్టిగా సపోర్ట్​ చేయగా.. మిగతా 13.9 శాతం మంది బాగుందన్నారు.
  • ఇక సర్కారు తీరు గురించి ఏమీ చెప్పలేమని 6.4 శాతం మంది చెప్పారు.
  • ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలు, పథకాలకు సంబంధించిన అంశాల్లోనూ ఆర్టీసీపై ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. సమ్మె విషయంగా, కార్మికుల పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. చివరగా సమ్మె పరిష్కారంపై కొంత సానుకూలత కనిపించినా.. చార్జీల పెంపు, బస్సుల కుదింపు వంటివాటిపై వ్యతిరేకత కనిపించింది.

Latest Updates