దేవుడా ఊరికెట్లా పోయేది.. సామాన్యుడి ఆక్రందన

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో సగటు నగర పౌరుడు తీవ్రమైన ఆందోళనలో ఉన్నాడు. ఇవాళ అక్టోబర్ 5 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ.. బస్సులు బంద్  చేశారు ఉద్యోగులు. దీంతో.. హైదరాబాద్ మహానగరంలోని ప్రతి బస్టాండ్ కూడా బోసిపోయింది. రయ్ రయ్ మంటూ ఊళ్లబాట పట్టాల్సిన బస్సులు.. డిపోల్లో.. బస్టాండ్లలో ఓ మూలన పడి ఉన్నాయి.

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి... ప్రయాణికుల ఆవేదన

ప్రైవేటు బస్సులు నడుపుతాం… స్కూల్ బస్సులు నడుపుతాం… అద్దెకు పొరుగు రాష్ట్రాలనుంచి బస్సులు తీసుకొస్తాం.. ప్రయాణికులకు ఇబ్బంది రానీయం.. అంటూ మంత్రులు, అధికారులు శుక్రవారం అక్టోబర్ 4న రకరకాలుగా చెప్పారు. ఉద్యోగుల స్ట్రైక్ ప్రభావం ప్రజలపై పడనీయం అని చెప్పారు. దీంతో.. ఎలాగోలా తమను ఇళ్లకు చేర్చే ప్రయత్నాలైతే జరుగుతున్నాయని ప్రయాణికులు పెద్దగా టెన్షన్ పడలేదు. కానీ.. రియాలిటీ మరోలా ఉంది.

శనివారం పొద్దున ఐదు, ఆరు గంటలకే బ్యాగులతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, కూకట్ పల్లి ఇలా.. పలు బస్టాండ్లకు చేరుకున్న జనాలు చుక్కలు చూస్తున్నారు. ఎంత సేపు చూసినా.. ఒక్క బస్సూ రాలేదు. ప్రైవేటు వెహికల్స్ అయిన సుమోలు, తూఫాన్లు, జీపులు, ఆటోల్లో వెళ్దామంటే… వంద రూపాయల ప్రయాణానికి 3వందలు, 4 వందలు వసూలు చేస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు.

బస్సులు రాక.. ప్రైవేటు వాహనాల్లో ఎక్కలేక.. జనం రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు. “ఆర్టీసీ సమ్మె లాంటి విషయాలు ప్రభుత్వం, సంస్థ చూసుకోవాలి. ఏ ఇష్యూ ఉన్నా ప్రజల వరకు రాకూడదు. పండుగ పూట జనం పడే ఇబ్బందులను జనం గుర్తించడం లేదా? ఆల్టర్ నేట్ ఏర్పాట్లు చేస్తా అన్నారు.. మరి ఏమైంది.. ఒక్క బస్సు కూడా కనిపించడం లేదు” ప్రయాణికులు గరం అవుతున్నారు. నెలరోజుల నుంచి సమస్యను చర్చలంటూ నాన్చి.. చివరకు ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగులు బెట్టు వీడకపోతే.. మధ్యలో జనం నలిగిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. 

Latest Updates