వీడియో వైరల్: బెంగళూరులో వింత సప్పుడు

బెంగళూరు: బెంగళూరు సిటీ బుధవారం మధ్యాహ్నం భారీ శబ్దంతో ఉలిక్కిపడింది. ఒక్కసారిగా వినిపించిన వింత సప్పుడుతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిందేమోనని భయపడ్డారు. లేక ఎక్కడైనా ఏదైనా పేలుడు సంభవించిందేమోనని అనుకున్నారు. శబ్దం వచ్చిన తర్వాత డోర్లు, కిటికీలు ఊగినట్లు స్థానికులు తెలిపారు. దేవనహల్లిలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సైడ్ నుంచి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో వచ్చిన ఈ శబ్దం… కల్యాణ్ నగర్, ఎంజీ రోడ్, మరాఠాహల్లి, వైట్ ఫీల్డ్, సర్జాపూర్, ఎలక్ట్రానిక్ సిటీ, హెబ్బగోడి, సీవీ రామన్ నగర్, ఓల్డ్ మద్రాస్ రోడ్, కుందనహల్లి,  హెచ్ఏఎల్, వివేక్ నగర్, రామ్మూర్తి నగర్ తదితర ఏరియాల్లో వినిపించింది. దాదాపు 54 కిలోమీటర్ల దూరం వరకూ శబ్దం వచ్చింది. ఈ  సప్పుడు భూకంపం వల్ల గానీ, పేలుడు వల్ల గానీ సంభవించినది కాదని అధికారులు స్పష్టం చేశారు.

ఫైటర్ జెట్ల శబ్దమా?

సిటీలో ఫైటర్ జెట్లు చక్కర్లు కొట్టడం వల్ల ఈ శబ్దం వచ్చి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ‘‘కర్నాటకలో మొత్తం 12 సిస్మిక్ మానిటరింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఏ ఒక్క దాంట్లోనూ భూప్రకంపనలు రికార్డు కాలేదు. ఇది భూప్రకంపనల వల్ల వచ్చిన శబ్దం కాదు. ఇదేదో తెలియని శబ్దం. దీనిపై ఇన్వెస్టి గేట్ చేయాల్సి ఉంది” అని కర్నాటక స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కమిషనర్ మనోజ్ రాజన్ తెలిపారు. ‘‘సిటీలో ఎలాంటి పేలుడు సంభవించలేదు. ఎక్కడా డ్యామేజ్ జరగలేదు. ఎక్కడి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్స్ రాలేదు. ఎయిర్ పోర్టు సైడ్ నుంచి శబ్దం వచ్చినట్లు సమాచారం ఉంది. దీనిపై ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాం. ఈ ఏరియాల్లో ఎయిర్ క్రాఫ్ట్ మూవ్ మెంట్ ఏమైనా ఉందా? ఏదైనా జెట్ లేదా సూపర్ సోనిక్ శబ్దమా? చెక్ చేయాలని అడిగాం” అని బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు చెప్పారు. వారి నుంచి ఇంకా సమాధానం రాలేదని, రిప్లై కోసం వెయిట్ చేస్తున్నామని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ శబ్దాన్ని కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. దీనిపై మీమ్స్, జోక్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కరోనా వైరస్ ప్రకృతి విపత్తులతో కలిసి ఉంటుందని ఓ నెటిజన్ పోస్టు పెట్టారు. ఏలియన్స్ భూమి మీదికి వచ్చి ఉంటాయని చాలామంది పోస్టు చేశారు.

Latest Updates