ప్రైవేటు హాస్పిటల్‌కే పోతున్రు: దేశంలో 55 శాతం మంది అటే

    దేశంలో 55 శాతం మంది ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనే ట్రీట్​మెంట్ చేయించుకుంటున్నరు

    42% మందే సర్కార్ ఆస్పత్రులకు

    ఎన్​ఎస్​ఓ సర్వేలో వెల్లడి

   మొత్తం ప్రసవాల్లో 28 శాతం సిజేరియన్లు.. ప్రైవేటులో ఎక్కువ

బీమార్ వస్తే సర్కారు దవాఖాన్లకు పోయోటోళ్ల కంటే ప్రైవేటు ఆస్పత్రులకు పోయేటేళ్లే ఎక్కువ. ప్రభుత్వ దవాఖాన్లలో ఎన్ని సౌలత్​లు ఏర్పాటు చేసినా ఈ పరిస్థితిలో మాత్రం మార్పు వస్తలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. దేశంలో 55 శాతం మంది రోగులు ప్రైవేటు దవాఖాన్లలో చేరి ట్రీట్​మెంట్ తీసుకున్నరట. 42 శాతం మంది మాత్రమే సర్కారు ఆస్పత్రుల్లో చికిత్స పొందారట. ఇక మిగతా మూడు శాతం మంది మాత్రం మెడికల్ చారిటబుల్ ట్రస్టుల్లో ట్రీట్​మెంట్ తీసుకున్నరంట. 75వ నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్)లో భాగంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) పేరుతో జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2017 జులై నుంచి 2018 జూన్ మధ్య ‘హౌస్​హోల్డ్ సోషల్ కన్సంప్షన్ రిలేటెడ్ టు హెల్త్’ పేరుతో ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1,13,823 కుటుంబాల్లోని 5,55,115 మంది నుంచి డేటా సేకరించారు. రోగాల ప్రొఫైల్, వాటికి అందించిన చికిత్స, హెల్త్ కేర్ అందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల పాత్ర, మందులకు అయ్యే ఖర్చులు, ఆస్పత్రుల్లో చేరడం, డెలివరీ ఖర్చులు తదితర అంశాలపై సర్వే నిర్వహించారు.

ప్రైవేటులో 55 శాతం సిజేరియన్లు

రూరల్ ఏరియాల్లో 90 శాతం డెలివరీలు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. అర్బన్ ఏరియాల్లో ఇది 96 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న ప్రసవాల్లో 28 శాతం సిజేరియన్​లే ఉంటున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 శాతం ఉండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 55 శాతం సిజేరియన్​లే ఉంటున్నాయి. సగటున ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీకి అయ్యే ఖర్చు రూరల్​ఏరియాల్లో, రూ.2,404 అర్బన్ ఏరియాల్లో 3,106 కాగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం రూరల్ ఏరియాల్లో 20,788, అర్బన్ ఏరియాల్లో రూ.29,105 ఖర్చు అవుతోంది.

ఇన్సూరెన్స్ ఉన్నోళ్లూ తక్కువే

దేశంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నోళ్లు చాలా తక్కువ అని సర్వేలో వెల్లడైంది. రూరల్ ఏరియాల్లో కేవలం 14 శాతం మంది, అర్బన్ ఏరియాల్లో 19 శాతం మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. రూరల్​ఏరియాల్లో 13 శాతం మంది, అర్బన్ ఏరియాల్లో 9 శాతం మంది ప్రభుత్వం స్పాన్సర్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అర్బన్ ఏరియాల్లో ఇన్సూరెన్స్ చేయించుకున్న వారిలో 6 శాతం మంది ఉద్యోగులే ఉన్నారు. 4 శాతం మంది సాధారణ ప్రజలు ఉన్నారు. దేశంలో 95 శాతం రోగాలకు అల్లోపతి ద్వారానే చికిత్స అందించారు. ప్రభుత్వం గతంలో మూడు సార్లు ఇలాంటి సర్వేలు నిర్వహించింది. 1995-‌‌=96, 2004, 2014లో స్టడీ చేసింది.

Latest Updates