ప్రభుత్వం చెబుతున్నా.. పబ్లిక్ పట్టించుకోట్లే..

భయం భయంగానే.. నిర్లక్ష్యంగా!

కరోనా వైరస్​పై భయపడుతున్నాజాగ్రత్తలకు దూరంగా జనం

రాష్ట్రంలో ఐదుకు చేరిన బాధితుల సంఖ్య

ఓ ఉమ్మడి జిల్లా కేంద్రానికి వచ్చిన పది మంది ఇండోనేషియా వాసులు

ఢిల్లీకి ఫ్లైట్​లో.. అక్కడి నుంచి ట్రైన్‌లో రాష్ట్రానికి రాక

అందరినీ సోమవారమే గాంధీలో ఐసోలేట్ చేసిన ఆఫీసర్లు

వారిలో ఒకరికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ

తప్పనిసరైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా లెక్కచేయకుండా
జనం ఊళ్లకు వెళ్తూనే ఉన్నారు. 

హైదరాబాద్, వెలుగు: కరోనా దేశ విదేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్​ కేసులతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ ఇద్దరు కలిసినా కరోనా ముచ్చటే వినిపిస్తోంది. పరిస్థితిపై భయపడటం కనిపిస్తోంది. అలవాటు ప్రకారం షేక్​హ్యాండ్ ఇస్తూ, కరోనా గుర్తుకొచ్చి నమస్తే పెడుతున్నారు. మాస్కులు, కర్చీఫ్​లు కట్టుకుంటున్నారు. హ్యాండ్​ శానిటైజర్లు వాడుతున్నారు. కానీ ఇదే సమయంలో జనంలో నిర్లక్ష్యం కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. తమకు మాత్రం రాదులే అన్నట్టుగా పబ్లిక్​ ప్రదేశాలకు వెళ్లడం, ఎక్కువగా జనం ఉన్న చోట్లలో తిరగడం, పిల్లలకు సెలవులు దొరికాయంటూ గుళ్లకు, టూర్లకు వెళ్లడం పెరిగింది. దీనికితోడు స్టూడెంట్లంతా సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. అసలే కరోనా విజృంభిస్తున్న సమయంలో జనం ఇలా వ్యవహరించడంపై డాక్టర్లు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్​ ప్లేస్​లకు దూరంగా ఉండాలనే కనీస ముందు జాగ్రత్తను లెక్కచేయకపోవడం సరికాదని స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వం ఆదేశించినా..

దేశంలో కరోనా వైరస్​ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ వరుసగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర సర్కారు పకడ్బందీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని విద్యా సంస్థలను, పార్కులు, థియేటర్లు, ఫంక్షన్​ హాళ్లు, బార్లు, పబ్బులను ఈ నెలాఖరు వరకు మూసేయాలని ఆదేశించింది.

ఇంట్లోనే ఉండండి.. బయట ఎక్కువగా తిరగకండి అని పదే పదే చెప్తున్నా కూడా హైదరాబాద్​లో రోడ్లమీద రద్దీ అట్లనే ఉంది. వీళ్లలో ఆఫీసులకు వెళ్లే వాళ్లు, ఇతర పనుల మీద వెళ్లే వాళ్లు సరే.. సెలవులు కదా అని సరదాగా తిరుగుతున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.

జనం పబ్లిక్​ ప్లేస్​లకు వెళ్లకూడదని, ఎక్కువ మంది గుమిగూడే ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టవద్దని సూచించింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల జనం యథేచ్ఛగా పండుగలు, పబ్బాలు, జాతర్లకు వెళ్తున్న తీరు కలవరపరుస్తోంది. సెలవులిచ్చారని స్టూడెంట్లు సొంతూళ్లకు బయల్దేరారు. ఇదే చాన్స్​ అన్నట్టుగా పుణ్యక్షేత్రాలు, ఆలయాలకు వెళ్లే వారు పెరిగిపోయారు. దీంతో బస్టాండులు, రైల్వే స్టేషన్లన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. థియేటర్లు, పార్కులు మూతపడటంతో గ్రేటర్​ హైదరాబాద్​తో పాటు జిల్లా కేంద్రాలన్నింటా మాల్స్, సూపర్​ మార్కెట్లలో జనం తాకిడి పెరిగింది. ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ కలిసి పుణ్యక్షేత్రాలు, సరదా టూర్లు, ట్రిప్పులకు వెళ్లడం పెరిగిందని క్యాబ్​లు, ప్రైవేటు ట్రావెల్స్​ ఆపరేటర్లు చెప్తున్నారు.

పెద్ద గుడులకు వేల మంది జనాలు

యాదాద్రి, వేములవాడ, కొమురవెల్లిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శని, ఆది, సోమవారాల్లో ఈ మూడు చోట్లకు వేలాది భక్తులు వచ్చారు. కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి బ్రహోత్సవాల జాతర జరుగుతుండటంతో మూడు రోజుల్లోనే 25 వేల మందికిపైగా భక్తులు దర్శనాలు చేసుకున్నారు. వచ్చే వారం ఇక్కడ జరిగే అగ్నిగుండాలతో బ్రహోత్సవాలు ముగుస్తాయి. దానికి యాభై వేల మందికిపైగా భక్తులు వస్తారని, అంత రద్దీని నియంత్రించడమెలా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రెండు రోజుల కిందట మెట్​పల్లి మండలం పెద్దాపూర్​లో మల్లన్న బోనాల పండుగకు వేల మంది భక్తులు హాజరయ్యారు. నాగర్​ కర్నూల్​ జిల్లా తలకొండపల్లి మండలం దేవుని పడకల్ బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ పెరగడంతో సోమవారంతోనే ముగించారు. బిజినేపల్లి మండలంలో వట్టెం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తుల తాకిడి పెరిగింది. జనాలు గుమిగూడ వద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా బ్రహోత్సవాలు, జాతరల సందడి అన్ని జిల్లాల్లో వెల్లువెత్తుతోంది. ఇక పసుపు రైతులు మద్దతు ధర ఇప్పించాలంటూ మెట్​పల్లిలో ఆందోళనకు దిగారు.

కట్టడి చేయకపోతే కష్టమే..

కరోనా ముప్పును తట్టుకునేందుకు నివారణే కీలకమని.. తొలి దశలో కట్టడి చేయకపోతే, వైరస్​ ముప్పుగా మారే ప్రమాదముందని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. నిర్లక్ష్యం మితిమిరితే భారీ ముప్ప తప్పదని ఇటలీ, స్పెయిన్​లలో ఒక్కసారిగా పెరిగిపోయిన కరోనా పాజిటివ్​ కేసులు, మృతుల సంఖ్య చూస్తే అర్థమవుతోంది. రాష్ట్రంలో పరిస్థితి కంట్రోల్​ లోనే ఉన్నా.. మెల్లగా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. వారంతా విదేశాల్లో వైరస్​ సోకిన తర్వాత ఇక్కడికి వచ్చినవారే. ఇంకా ఇక్కడెవరికీ సోకలేదు. కానీ విదేశాల నుంచి వచ్చినవారు జనంలో తిరిగితే ఇతరులకు సంక్రమించే ప్రమాదం ఎక్కువ. వేల మంది ఒకే చోట ఉన్నట్లైతే పెద్ద సంఖ్యలో వైరస్​ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందువల్ల కొద్దిరోజుల పాటు వీలైనంత వరకు  బయటికి రావొద్దని డాక్టర్లు చెప్తున్నారు. ప్రజలంతా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని, అందరూ సహకరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చన్నారు.

For More News..

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

Latest Updates