చేపల వేటకు వెళ్లిన జాలర్లు: సముద్రంలో పడవ మునక

  • అర్ధరాత్రి లంగరు వేసి నిద్రపోయిన 8 మంది మత్స్యకారులు
  • పడవకు రంధ్రం పడి నీళ్లు.. మరో బోటులో సేఫ్‌గా ఒడ్డుకు

చెన్నై: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ నడి సంద్రంలో మునిగిపోయింది. ఆ క్షణంలో చేతిలో ఫోన్ ఉండడంతో ఆ బోటులోని 8 మంది జాలర్లు ప్రాణాలతో సేఫ్‌గా ఒడ్డుకు చేరారు. తమిళనాడు తీరంలో శుక్రవారం జరిగిందీ ఘటన.

పుదుచ్చేరి వీరాంపట్నం గ్రామానికి చెందిన 8 మంది జాలర్లు గురువారం మధ్యాహ్నం ఫైబర్‌ పడవలో చేపల వేటకు వెళ్లారు. వీరు అర్ధరాత్రి నడి సముద్రంలో పడవకు లంగరు వేశారు. తెల్లవారుజామున 4 గంటలకు వలలు వేద్దామనుకుని పడవలో నిద్రపోయారు.

కానీ శుక్రవారం తెల్లవారు జామున బోటులోకి నెమ్మదిగా నీళ్లు రాసాగాయి. బోటులో ఉన్న ఓ మత్స్యకారుడు దీన్ని గమనించాడు. వెంటనే తమ దగ్గర ఉన్న ఫోన్‌తో అక్కడికి సమీపంలో చేపల వేట సాగిస్తున్న జాలర్లకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని జాలర్లను రక్షించారు. వారి పడవల్లో ఆ ఎనిమిది మంది జాలర్లతో సహా అంతా ఒడ్డుకు చేరుకున్నారు.

అది శాటిలైట్ ఫోనా?

సాధారణంగా మనం ఊరి శివారులోకి వెళ్తేనే ఫోన్ సిగ్నల్ రావడం కష్టంగా ఉంటుంది. అలాంటిది జాలర్లు నడి సంద్రంలోకి వెళ్లినప్పుడు సిగ్నల్ దొరకడం ఎలా సాధ్యమన్న ప్రశ్న తలెత్తుతోంది. వారి దగ్గర శాటిలైట్ ఫోన్ ఉంటే తప్ప ఆ సమయంలో మరో బోటులోని మత్స్యకారులకు సమాచారం ఇవ్వడం అసాధ్యం. దీన్ని బట్టి వారి దగ్గర ఉన్నది శాటిలైట్ ఫోన్ అయ్యుండొచ్చని తెలుస్తోంది. తీర ప్రాంత రక్షణతో పాటు వారు ప్రమాదాల బారిన పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం సముద్రంలోకి వెళ్లే జాలర్లకు ఇటీవల శాటిలైట్ ఫోన్లను అందిస్తోంది.

కళ్ల ముందే నిట్టనిలువునా మునిగిన బోటు

ఆ మత్స్యకారుల కళ్ల ముందే వారి బోటు క్షణాల్లో సముద్రంలో మునిగిపోయింది. నీరు పడవలోకి చేరడంతో నిట్టనిలువునా లోపలికి దూసుకెళ్లింది. ఈ మొత్తం సీన్‌ను జాలర్లు వీడియో తీశారు.

Latest Updates