దేశంలో పల్మనాలజిస్టులు 2,500 మందే!

 

వైరాలజిస్టుల సంఖ్య  కూడా చాలా తక్కువ

కరోనా లాంటి వైరస్ లు విజృంభిస్తే కష్టమే

హెల్త్ నిపుణుల ఆందోళన

కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. లక్కీగా అది మనదేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడలేదు. ఒకవేళ చైనాలో మాదిరిగా మనదేశంలోనూ కరోనా లాంటి వైరస్ లు విజృంభిస్తే..? పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మన దగ్గర సరిపోయేంత మంది స్పెషలిస్టులు ఉన్నారా? అంటే.. అస్సలు లేరట. అవును. మనదేశంలో కరోనాలాంటి వైరస్ లను కట్టడి చేయాలంటే ముఖ్యంగా పల్మనాలజిస్టులు, వైరాలజిస్టుల కొరత చాలా తీవ్రంగా ఉందని హెల్త్ నిపుణులు చెప్తున్నారు. కొత్త వైరస్ లకు వ్యాక్సిన్ లను తయారు చేయడంపై మనదేశంలో రీసెర్చ్ లు కూడా పెద్దగా జరగడం లేదని అంటున్నారు.

1,457 మందికి ఒక్క డాక్టరే ఉన్నరు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసు ప్రకారం, ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ మన దేశంలో ప్రతి 1,457 మందికి ఒక డాక్టర్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. ఇక పల్మనాలజిస్టులు, వైరాలజిస్టులు, ఇతర స్పెషలిస్టుల సంఖ్యను చూస్తే మరింత తక్కువగా ఉంటుందని అంటున్నారు. మనదేశంలో పల్మనాలజిస్ట్ కావాలంటే.. ముందుగా ఐదేళ్ల పాటు ఎంబీబీఎస్ డిగ్రీ చేయాలి. ఆ తర్వాత మూడేళ్లపాటు పీజీ డిగ్రీ (ఎండీ లేదా ఎంఎస్) చేయాలి. అప్పుడే పల్మనరీ మెడిసిన్ లో ఒక సూపర్ స్పెషాలిటీ మెడికల్ డిగ్రీ (డీఎం/ఎండీ) వస్తుంది. అందుకే.. మన దేశంలో పల్మనాలజిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాలేజీ డీన్ డాక్టర్ వీకే మోంగా పేర్కొంటున్నారు. ఢిల్లీలో సైతం కేవలం 25 మంది పల్మనాలజిస్టులే ఉన్నారని, దేశ రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మిగతా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. దేశం మొత్తం మీద క్వాలిఫైడ్ చెస్ట్ స్పెషలిస్టులు (పల్మనాలజిస్టులు) కేవలం 2,500 మంది వరకూ ఉంటారన్నారు. దేశవ్యాప్తంగా డీఎం/ఎండీ పల్మనరీ మెడిసిన్ కోర్సులో 700 సీట్లు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. కరోనా లాంటి వైరస్ లు విజృంభిస్తే, అవి వేగంగా మార్పులు చెందుతుంటాయని, అందువల్ల వాటిని స్టడీ చేసేందుకు కావలసినంత సంఖ్యలో వైరాలజిస్టులు కూడా లేరని వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ టి.జె. జాన్ వెల్లడించారు. వాస్తవానికి ప్రతి మెడికల్ కాలేజీలో ఒక వైరాలజీ యూనిట్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

Latest Updates