పుల్వామా దాడి మాస్టర్ మైండ్ హతం.. మట్టుబెట్టిన ఆర్మీ

కశ్మీర్: దెబ్బకు దెబ్బ కొట్టారు. ఉగ్రమూకలు భారత్ లో అడుగుపెడితే అంతు చూస్తామని గట్టిగా జవాబు చెప్పారు. పుల్వామా దాడిపై కసి తీర్చుకోవడం మొదలుపెట్టారు. ఏ కలుగులో దాగున్న వదిలేది లేదని చెప్పిన భద్రతా దళాలు చేసి చూపించాయి. పుల్వామా దాడి మాస్టర్ మైండ్, జైషే మహమ్మద్ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీని హతమార్చారు. పుల్వామా జిల్లా పింగ్లాన్ లో ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు ఆర్మీ జవాన్లు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాది ఆదిల్ వెనుకనుండి నడిపించిన జైషే కమాండర్ రషీద్, మరో ఉగ్రవాది ముఫ్తీ అబ్దుల్లాను హతమార్చారు.

శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారన్న సమాచారం రావడంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ మొదలు పెట్టింది. పింగ్లాన్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత ప్రాంతంలోకి రాగానే గాల్లోకి కాల్పులు జరిపారు.

కలుగులో ఉన్న ఉగ్రవాదులను రెచ్చగొట్టి బయటకు లాగారు. హోరోహోరీ జరిగిన కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. పట్టువదలకుండా వారిని అంతం చేయాలన్న కసితో కాల్పులు జరిపారు జవాన్లు. పుల్వామా దాడి మాస్టర్ మైండ్ ను మట్టుబెట్టారు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.  ఆ ఇంట్లో మరో ఉగ్రవాది దాగి ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Updates