ఆ ముష్కరులు.. పాక్ మీడియాకు యోధులట!

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది. అమరులైన జవాన్లకు సంతాపం తెలిపింది. టెర్రరిస్టులను ఏరిపారేయడంలో భారత్ కు తమ మద్దతు ఉంటుందంటూ పలు దేశాలు ప్రకటించాయి.

పాకిస్థాన్ మాత్రం తన వక్ర బుద్ధిని బయటపెట్టుకుంది. దర్యాప్తు చేయకుండానే నిందలా అని ఉగ్రవాదులను వెనకేసుకుని వచ్చింది. భారత ఆక్రమిత కశ్మీర్ అంటూ పాక్ విదేశాంగ శాఖ ప్రకటనలు విడుదల చేసింది. ఆ దేశ ప్రభుత్వమే అలా ఉందనుకుంటే… మీడియా కూడా అదే బాటలో నడిచింది.

పుల్వామా దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని ప్రకటనలు చేస్తే.. పాక్ మీడియా మాత్రం ఆ దాడికి పాల్పడిన ముష్కరులను యోధులంటూ కీర్తించింది.  స్వాతంత్ర్య సమర యోధులంటూ నెత్తికెక్కించుకుంది. ‘ది నేషన్’ అనే పత్రిక ‘స్వాతంత్ర్య పోరాటంలో ఉన్న వీరుల దాడి’ అని హెడ్డింగ్ తో కథనం రాసింది. ఓ వైపు ముష్కర మూకలను పొగుడుతూనే జైషే మహ్మద్ కు ఈ దాడితో సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే పుల్వామా దాడి తామే చేశామని, ఆ ఉగ్ర సంస్థ స్వయంగా ప్రకటించుకుంది. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ఫొటో, వీడియోను కూడా విడుదల చేసింది.

‘ది నేషన్’ ఒక్కటే కాదు.. ఆ దేశానికి చెందిన ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్, డైలీ టైమ్స్ వంటి పలు మీడియా సంస్థలు ఇదే తరహా కథనాలను ప్రచురించాయి. కశ్మీర్ ను భారత్ ఆక్రమించుకుందంటూ విష ప్రచారానికి చేస్తున్నాయి పాక్ పత్రికలు.

సోషల్ మీడియాలో యువత ఆగ్రహం

పాక్ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై కశ్మీరీలు సహా భారత్ మొత్తం మండిపడుతోంది. సోషల్ మీడియాలో యువత తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాక్ మీడియా పిచ్చి పిచ్చి రాతలు కట్టిపెట్టాలంటూ కొందరు, కశ్మీర్ ను మా నుంచి వేరు చేయలేరంటూ మరికొందరు యువత కామెంట్లు చేస్తున్నారు. జవాన్ల త్యాగానికి ఇప్పుడే సమాధానం చెప్పాలని, పాక్ కు బుద్ధి వచ్చేలా చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Latest Updates