పుల్వామా బాధిత కుటుంబాల మాట : యుద్ధం వద్దు .. టెర్రరిజమూ వద్దు

న్యూఢిల్లీ: ‘‘సరిహద్దుల్లో పరిస్థితి చూస్తుంటే ఏ క్షణమైనా ఇండియా, పాక్ మధ్య వార్ రావొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నా యి. యుద్ధం సృష్టించే బీభత్సం ఎలాంటిదో ఒక్కసారి చరిత్రను తిరగేస్తే తెలుస్తుంది. శాంతి స్థాపనతోనే సమస్యలు పరిష్కారమవుతాయి’’ అంటున్నాయి పుల్వామా ఉగ్రదాడి బాధిత కుటుంబాలు. యుద్ధం వైపు అడుగులు వేయొద్దని, ప్రాణాల విలువను గుర్తించండని విన్నవిస్తున్నాయి. పాలకులు తలచుకుంటే టెర్రరిజాన్ని అంతం చేయొచ్చని సూచిస్తున్నాయి. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.

తమ వారిని కోల్పోయిన అమరజవాన్ల కుటుంబాలు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళన చెందు తున్నాయి. ఉగ్రవాదులపై ఈ నెల 26న ఐఏఎఫ్ జరిపిన దాడిని స్వాగతిస్తున్నామని, అలా అని యుద్ధాన్ని కోరుకోవడంలేదని చెప్తున్నాయి. యుద్ధం వద్దన్నందుకు ట్రోల్ మిత్ర.. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈమె భర్త బబ్లూ సాంత్ర పుల్వామా ఉగ్రదాడిలో అమరుడయ్యారు. సెలవులు తీసుకొని ఇంటికి వస్తానని చెప్పిన భర్త శవమై రావడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. నాలుగేళ్ల బిడ్డ.. ‘అమ్మా.. లే అమ్మ’ అని పిలిస్తే కానీ.. ఆ తల్లి లేవలేదు. ఘటన జరిగిన రెండు వారాలు గడుస్తున్నా .. ఆ ఇంట్లో ఇప్పటికీ పొయ్యి కూడా సరిగ్గా వెలుగడంలేదు. బబ్లూ సాంత్రను కలవరిస్తూనే ఆ కుటుంబం రోదిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పరిణామాలపై విలేకరులు మిత్రను పలుకరించగా.. ‘నేను చెప్పేది ఒక్కటే. ప్రాణం విలువ ఏంటో మాకు తెలుసు. పోయిన ప్రాణాలను తీసుకురాలేం. మేము అనుభవిస్తున్న బాధ మరొకరు అనుభవించొద్దు’ అని అన్నారు.

హిస్టరీ టీచర్ అయిన మిత్రను.. సరిహద్దుల్లో ని పరిస్థితి చూస్తే ఏమనిపిస్తోందని ప్రశ్నించగా.. ‘ఇండియా, పాక్ మధ్య యుద్ధం వచ్చేలా ఉందని వార్తలు వస్తున్నాయి. యుద్ధం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. శాంతి స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఎట్టిపరిస్థితుల్లో నూ వార్ దిశగా అడుగులు వేయొద్దు’ అని కోరారు. పాక్ లో ని టెర్రరిస్టు స్థావరాలపై ఐఏఎఫ్ జరిపిన స్ట్రయిక్స్​ను స్వాగతిస్తున్నామని చెప్పారు. కొన్ని పార్టీలు పుల్వామా ఉగ్రదాడిని రాజకీయం చేయాలనుకుంటున్నాయని, ఇది తగదని సూచించారు. యుద్ధం వద్దని మిత్ర చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. కొందరు ఆమెను టార్గెట్ గా చేస్తూ రాతలు రాస్తున్నారు. దీనిపై కూడా మిత్ర స్పందిస్తూ.. ‘నేను సోషల్ మీడియాను చూడను. యుద్ధం వద్దన్నందుకు నాపై కొందరు కామెంట్లు చేస్తున్నారట. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది. అలా అని మనసులు గాయపరిచేలా ప్రవర్తించొద్దు. ప్రాణం విలువ తెలిసినదానిగా నా మాట నేను చెప్పాను. అంతకే కొందరు మమ్మల్ని పాకిస్థాన్ వెళ్లిపొమ్మంటూ కామెంట్స్​ చేస్తున్నా రట.’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

Latest Updates