జైషేపై యాక్షన్ తీసుకోండి: పాక్ హై కమిషనర్ ని పిలిచి భారత్ నిరసన

సొహాలీ

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని పాకిస్థాన్ ను హెచ్చరించింది భారత విదేశాంగ శాఖ. ఢిల్లీలోని ఆ దేశ హై కమిషనర్ సొహాలీ మహమూద్ ను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. భారత విదేశంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఇవాళ ఉదయం తమ కార్యాలయానికి రావాలని సొహాలీకి సమన్లు పంపారు.

మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చాక పుల్వామా దాడికి పాక్ ను బాధ్యులుగా చేస్తూ సొహాలీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు గోఖలే. వెనువెంటనే జైషే మహ్మద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖంపైనే గట్టిగా చెప్పారు. పాక్ భూభాగంపై నుంచి ఆపరేట్ అవుతున్న ఉగ్ర మూకలేవీ భారత్ లోకి రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అలాగే పుల్వామా దాడిపై పాక్ విదేశాంగ శాఖ మంత్రి విడుదల చేసిన ప్రకటనను కూడా తిప్పికొట్టారు. భారత విదేశాంగ శాఖ నిరసన చవిచూశాక సొహాలీ వెనుదిరిగారు.

Latest Updates