పంక్చర్​ షాపు ఓనర్.. డిఫరెంట్​ వెహికిల్స్ క్రియేటర్

చదివింది నాలుగో తరగతి అయినా  ఐఐటీ స్టూడెంట్​లా​ ఆలోచిస్తాడు అంజద్​. సిద్దిపేటలోని ఆయన షాపుకు వెళ్లి చూసిన వాళ్లు .. వావ్​ అనకమానరు…ఎందుకంటే అంజద్​ కొత్తగా ఆలోచిస్తాడు. డిఫరెంట్​ వెహికిల్స్​ తయారు చేస్తాడు. అలాగని ఒకటో రెండో తయారుచేసుంటాడు అనుకునేరు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటివరకు వందకుపైగా బుల్లి బుల్లి సైకిళ్లు, బైక్​లు తయారుచేశాడు.

సిద్దిపేట, వెలుగు: అంజద్​ పాషాది సిద్దిపేట జిల్లా చేర్యాల. బైక్​ పంక్చర్​ షాపు ఓనర్. ఆ షాపునే లాబరేటరీగా మార్చి బుల్లి బుల్లి బైకులు, సైకిళ్లు, డిఫరెంట్​ వెహికల్స్​ తయారుచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తల్లి కూలీ పనిచేసేది. దాంతో మేనమామ దగ్గర పెరిగాడు. వాళ్ల అన్నయ్య దగ్గర సైకిళ్లకు పంక్చర్లు వేయడం నేర్చుకున్నాడు. పంక్చర్లు చేస్తూ పొట్ట నింపుకునేవాడు. ఒకసారి పేపర్​లో ‘ఇద్దరు కలిసి ఒకే సైకిల్​ను తొక్కడం’ చూశాడు. అంతే తాను కూడా డిఫరెంట్​ మోడళ్లలో సైకిళ్లు తయారు చేయాలనుకున్నాడు. సైకిళ్లకు అవసరమైన వస్తువులను కొనేవాడు. డబ్బు కూడా బాగా ఖర్చయ్యేది. దాంతో చిన్న చిన్న విడి భాగాలను సొంతంగా తయారు చేసేవాడు. ఏడాది తర్వాత ‘ఇద్దరు తొక్కే’ సైకిల్​ను తయారుచేశాడు. అంజద్​ టాలెంట్​ చూసి చాలామంది ప్రోత్సహించారు. అప్పట్నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు వంద రకాల చిన్న సైకిళ్లు, బైక్స్​ తయారుచేశాడు. ప్రస్తుతం ప్రపంచలోనే అతి పెద్ద సైకిల్​ తయారుచేసే పనిలో ఉన్నాడు.

సైకిళ్లపై ఇష్టంతో..

అంజద్​ షాపులో ఆరంగుళాల మొదలుకొని పదిహేను అడుగుల ఎత్తైన సైకిళ్ల వరకు కనిపిస్తాయి. టీవీ మోటార్​ భాగాలతో ఒక డిఫరెంట్​ సైకిల్​ తయారు చేశాడు. అది సైకిల్​ అయినా, చూసేందుకు మాత్రం బైక్​లా ఉంటుంది. అంజద్​ దానిపై చక్కర్లు కొడుతుంటే చూసే వాళ్లంతా ఆశ్చర్యపోతారు.

ప్రమాదం జరిగినా..

ఒకసారి పదిహేను అడుగుల సైకిల్​ను తలకిందులుగా తొక్కుతుండగా బ్యాలెన్స్​ తప్పి కింద పడిపోవడంతో, తొడభాగంలో ఎముక విరిగింది. ఆరు నెలలు మంచానికే పరిమితమయ్యాడు. మళ్లీ కోలుకొని ప్రయోగాల బాట పట్టాడు​.

డిఫరెంట్​ సైజుల్లో బైకులు, సైకిళ్లు తయారుచేస్తున్న అంజద్​ టాలెంట్​కు ‘చాంపియన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​, తెలుగు బుక్ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్, వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్, గ్యాలెక్సీ బుక్ ఆఫ్​ వరల్డ్​రికార్డ్స్’… ఇలా ఎన్నో రికార్డులు, అవార్డులు సొంతమయ్యాయి.

 

 

ఐడెంటిటీ కోసమే..

అంజద్​ తయారుచేసిన చిన్న వెహికల్స్​ను షాపులోనే భద్రపరుచుకుంటాడు. చాలామంది ముచ్చటపడి ‘మాకు ఒకటి కావాలి.. తయారుచేసి ఇస్తావా’ అని అడుగుతుంటారు. కానీ అంజద్​ మాత్రం వాటిని అమ్మడానికి ఇష్టపడడు. కేవలం ‘ఐడెంటిటీ కోసం తయారు చేస్తున్నా’ అంటాడు. సంపాదనలో సగం… సైకిళ్ల తయారీకి ఖర్చుచేస్తాడు.

Latest Updates