కార్టూన్స్ చూస్తుంటే టీవీ ఆపేసిన త‌ల్లి.. ఉరేసుకుని 14 ఏళ్ల కొడుకు ఆత్మ‌హ‌త్య‌

రోజంతా అదేప‌నిగా టీవీలో కార్టూన్స్ చూస్తూ కూర్చుంటున్నాడ‌ని త‌ల్లి తిట్ట‌డంతో 14 ఏళ్ల కొడుకు సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మ‌హారాష్ట్ర‌లోని పుణేలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

పుణేలోని బిబ్వేవ‌డీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల పిల్లాడు ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. క‌రోనా లాక్ డౌన్ కార‌ణం స్కూళ్లు లేక‌పోవ‌డంతో ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో రోజంతా టీవీల‌కు అతుక్కుపోయి కూర్చుంటున్నాడు. అదే ప‌నిగా కార్టూన్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నాడు. దీంతో అత‌డిని త‌ల్లి తిట్టేది. నిన్న కూడా ఇలానే టీవీకి అతుక్కుపోయి ఉద‌యం నుంచి కార్టూన్ చానెల్స్ చూస్తున్నాడు. ఆ స‌మ‌యంలో అత‌డి బామ్మ న్యూస్ చూడాల‌ని అడిగినా అత‌డు ఒప్పుకోలేదు. కొంచెంసేపు చానెల్ మార్చాల‌ని చెప్పినా విన‌క‌‌పోవ‌డంతో ఆ పిల్లాడి త‌ల్లి టీవీ స్విచ్ ఆపేసింది. దీంతో కోపంగా లేచి గ‌దిలోకి వెళ్లిపోయి.. సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. కొంత స‌మ‌యం త‌ర్వాత ఆ గ‌దిలోకి వెళ్లిన త‌ల్లి.. కొడుకును ఆ స్థితిలో చూసి గ‌ట్టిగా కేక‌లు పెట్టింది. ఇంట్లోని వాళ్లంతా వ‌చ్చి ఆ పిల్లాడిని హుటాహుటీన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే అత‌డు మ‌ర‌ణించాడ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. దీంతో ఆ త‌ల్లి గుండెల‌విసేలా ఏడ్చింది. త‌న బిడ్డ ఇంత చిన్న‌దానికే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డంతో ఆ మాతృమూర్తి ప్రాణం అల్లాడిపోయింది. కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆ పిల్లాడి మృత‌దేహాన్ని స‌స్సూన్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి పోస్టుమార్టం నిర్వ‌హించారు.

Latest Updates