టిక్​టాక్​ సిన్మా పండుగొచ్చింది

  • టిక్​టాక్​ సిన్మా పండుగొచ్చింది
  • 12 కేటగిరీల్లో నిర్వహిస్తున్న పుణే ఈవెంట్​ మేనేజర్

టిక్​టాక్​.. యువతరాన్ని ఊపేస్తున్న వీడియో షేరింగ్​ యాప్​. సరదాలతో పాటు వివాదాలనూ కొని తెచ్చుకుంటున్నారు. కొందరైతే ఆఫీసుల్లోనూ టిక్​టాక్​ పిచ్చితో వీడియోలు చేసి ఉద్యోగాలూ పోగొట్టుకున్నారు. కాసేపు దానిని పక్కనపెడదాం. కొత్త విషయమేంటంటే, టిక్​టాక్​ ఫిల్మ్​ ఫెస్టివల్​. అవును, మీరు చదువుతున్నది నిజమే. మొట్టమొదటి టిక్​టాక్​ సిన్మా పండుగ. పుణేలో ఇప్పటికే మొదలయ్యాయి. ఆ టిక్​టాక్​ సిన్మా పండుగను ప్రకాశ్​ యాదవ్​ అనే ఓ ఈవెంట్​ ఆర్గనైజర్​ నిర్వహిస్తున్నాడు. ‘‘టిక్​టాక్​ ఇప్పుడు మస్తు ట్రెండ్​ అవుతోంది. ఎక్కడ చూసినా టిక్​టాక్​ వీడియోలు హల్​చల్​ చేస్తున్నాయి. స్టూడెంట్లు, ఉద్యోగులు కాలేజీల్లో, ఆఫీసుల్లోనూ వీడియోలు చేస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే ఈ టిక్​టాక్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ను తీసుకొచ్చాం” అని ప్రకాశ్​ చెప్పాడు. జులై 24న మొదలైన ఈ ఫెస్టివల్​ ఆగస్టు 20 వరకు జరుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందినోళ్లూ వాళ్ల వాళ్ల వీడియోలను పంపించొచ్చు. గెలిచినోళ్లకు డబ్బుతో పాటు ట్రోఫీనిస్తారు. మొదటి ప్రైజ్​ కింద ₹33,333, రెండో ప్రైజుకు ₹22,222, మూడో ప్రైజుకు ₹5,555 ఇస్తారు. 12 కేటగిరీలుగా ఈ ఫెస్టివల్​ను నిర్వహిస్తున్నారు. కామెడీ, ఎమోషన్​, యాక్షన్​, ఉత్తమ జంట కేటగిరీలుగా పోటీ పెడుతున్నారు. అంతేకాదు, సోషల్​ అవేర్​నెస్​ (అవగాహన), పర్యావరణం వంటి విభాగాల్లోనూ పోటీ పెట్టారు. పోటీల్లో పాల్గొని గెలవలేకపోయిన వాళ్లకూ పార్టిసిపేషన్​ సర్టిఫికెట్లు ఇస్తామని ప్రకాశ్​ చెప్పాడు. బాగుంది కదా ఐడియా. మరి, మీరు పంపారా మీ టిక్​టాక్​ వీడియోల్ని?

 

Latest Updates